బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణ జనసేన కార్యకర్తలు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది
పవన్ కళ్యాణ్ కూ, తనకూ ఎంతో సారూప్య కథ ఉందని బాలకృష్ణ తెలిపారు. టీడీపీకి అండగా నిలుస్తున్నందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ముందుగా కృతజ్ఞత చెప్పుకోవాలన్నారు. తాను కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతామన్నారు. తాము ఎవరికీ భయపడబోమన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఇష్టారాజ్యంగా జరుగుతుందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని బాలకృష్ణ విమర్శించారు
రాష్ట్రంలో ఎక్కడ ఒక పని కూడా జరగట్లేదన్నారు. హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం రెండు పార్టీలు టీడీపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని బాలయ్య వెల్లడించారు. టీడీపీ- జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమన్నారు. నాడు ఎన్టీ రామారావు కూడా పార్టీలన్నింటినీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేసారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ జై టీడీపీ, జై జనసేన నినాదాలు చేశారు.
పవన్ కళ్యాణ్ యజ్ఞంలో సమిధ కావడానికి ముందుకొచ్చారని, జనసేన, టీడీపీ కలయిక కొత్త శకానికి నాంది పలికినట్టేనని బాలకృష్ణ పేర్కొన్నారు. సీట్ల లెక్క కాదు, రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాల్సిందేనన్నారు. ప్రజలకు మేము, జనసైనికులం రక్షక భటులుగా ఉంటామన్నారు. వైసీపీ సామాజిక బస్సుయాత్రలో మహానీయుల ఫోటోలు ఎక్కడున్నాయని బాలయ్య ప్రశ్నించారు. పూలే లాంటి వారి ఫోటోలు కింద, వీరి నాయకుల ఫోటోలు పైన ఉన్నాయని విమర్శించారు.
రాష్ట్ర పాలన నేరస్థుల చేతుల్లోకి వెళ్ల కూడదన్నదే తమ ఉద్దేశ్యమని బాలకృష్ణ తెలిపారు. సీఎం జగన్ సహా వైసీపీ వారంతా ఆవు తోలు కప్పుకున్న పులులన్నారు. ఎవర్నీ ఉపేక్షించేది లేదని, ఇక జరగబోయేది ఉద్యమమేనన్నారు. ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రమా అని బాలయ్య పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులను ఎక్కడెక్కడ ప్రజలు నిలదీస్తున్నారని, రేపు జరగబోయే ఎన్నికలు మన ఉనికి కోసం పోరాటమే అన్నారు.
వైసీపీ నేతలు నవరత్నాలు అంటున్నారని, అది ఎవడబ్బ సొమ్ము కాదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు, చివరకు గాలి మీద పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. అమరావతి ఉద్యమకారులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారని, అసలైన పెయిడ్ ఆర్టిస్టులు విశాఖ సమ్మిట్ లో పాల్గొన్న వారని బాలయ్య విమర్శలు గుప్పించారు. లక్షలకు లక్షలు సలహాదారులకు ఇస్తున్నారని, హిందూపురంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదన్నారు. తామే సొంతంగా డబ్బులు తీసుకొచ్చి.. పనులు చేస్తున్నామన్నారు
























Discussion about this post