తెలంగాణ లో బీజేపీ బీసీ కార్డు ప్రయోగిస్తూ ఎన్నికల పోరులోకి దూకిన విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ‘బీసీ గర్జన’సభ చేపట్టేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. నవంబర్ లో మోదీ అందుబాటులో ఉండే తేదీని బట్టి హైదరాబాద్‌లో భారీ స్థాయిలో సభ నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీని సీఎం చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 52 శాతానికిపైగా ఉన్న బీసీలు, ఎంబీసీల మద్దతు సాధించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మోదీ సభ ద్వారా సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… ఇతర నేతలు ‘బీసీ గర్జన’సభలో పాల్గొంటారని అంటున్నాయి. ఈ బీసీ గర్జన సభ విషయమై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, మోర్చా రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఇక నవంబర్ 3న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 28న ప్రచారపర్వం ముగుస్తుంది. మొత్తం ఆరు ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలుస్తోంది . ఇప్పటికే ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల పరిధిలో జరిగిన సభల్లో మోదీ పాల్గొన్నారు. మిగతా జిల్లాలనూ కవర్ చేస్తూ చివరగా హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే సభ తో ప్రధాని ప్రచారం ముగుస్తుందని అంటున్నారు. హైదరాబాద్ సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
మరోవైపు ఇదే సమయంలో పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీనడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్యనేతలు విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. వచ్చేనెల 3 నుంచి పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లోనూ కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తంగా రోజూ కనీసం ఒకటి, రెండు సభలు, రోడ్ షోలు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బీజేపీ ప్రముఖలంతా కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాల్లో కూడా పర్యటిస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాముఖ్యతను ఓటర్లకు వివరిస్తారు. ఎలాగైనా కేసీఆర్ కి చెక్ పెట్టాలని భావిస్తున్న బీజేపీ సర్వ శక్తులు ఒడ్డే ప్రయత్నాలు చేస్తోంది.
Discussion about this post