తారాపీఠ్ అమ్మ వారు ఏది అడిగినా ఇస్తుందా ? అక్కడ తాంత్రిక పూజలు జరుగుతుంటాయా ? అంటే అవుననే చెబుతారు భక్త జనం. తారాదేవి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
తాంత్రిక ఆలయాల్లో తారాపీఠ్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్నశ్మశానం లో అఘోరాలు, తాంత్రికులు, మంత్రగాళ్ళు తాంత్రిక శక్తి కోసం పూజలు చేస్తుంటారు. వారి పూజలు భయంకరంగా ఉంటాయని చెబుతుంటారు.ఈ ఆలయం పశ్చిమ బెంగాల్ లోని బీర్బుమ్ జిల్లాలో తారాపీఠ్ అనే చిన్న పట్టణంలో ఉంది.పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు.
ఇక్కడ అమ్మవారిని ఏది అడిగినా కరుణించి ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అమావాస్య రోజుల్లో అమ్మవారి విగ్రహానికి అద్భుతమైన శక్తి ఉంటుందని … ఆ సమయంలో దేవిని ఉపాసన చేసిన వారికి తాంత్రిక శక్తులు సిద్ధిస్తాయని అంటారు. విదేశాలనుంచి కూడా ఇక్కడికి ఎక్కువమంది పర్యాటకులు వస్తుంటారు. దేవాలయంలో అమ్మవారికి రెండు విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహం శివుడికి పాలు ఇచ్చేదిగా కనిపిస్తుంది. ఇది రాతితో నిర్మితమైన నల్లటి విగ్రహం. ఈ విగ్రహం ఎల్లప్పుడూ పూలతో కప్పిఉంటుంది. కేవలం అమ్మవారి మొహం మాత్రమే చూడటానికి వీలవుతుంది.
మరొకటి వివిధ లోహాలతో చేసిన విగ్రహం. ఈ విగ్రహ రూపం భయంకరంగా ఉంటుంది. నాలుగు చేతులతో, రుధిర వర్ణ నేత్రాలతో అమ్మ ఆగ్రహంగా కనిపిస్తుంది. చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కపాల హారాన్ని ధరించి భయం గొలిపే రీతిలో ఉంటారు. ఈ రూపాన్నే తాంత్రికులు ఎక్కువగా పూజిస్తుంటారు. ఇక్కడ జంతు బలులు ఎక్కువగా జరుగుతుంటాయి. మామూలు భక్తులు కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు జంతువులను తెచ్చి బలి ఇస్తుంటారు.
తారాదేవి ఏ రూపంలో అయినా సాధకునికి దర్శనం ఇస్తుంది. ప్రసన్నమైన రూపాలనుంచి అతి భయంకరమైన రూపాలవరకూ ఏ రూపాన్నైనా ఈమె ధరించగలదు. ఉగ్రతార, శ్మశాన తార మొదలైన రూపాలు అతి భయంకరంగా ఉంటాయి.ఆషామాషీ సాధకులు ఈ దర్శనాలు తట్టుకోలేరు. తారాదేవిని త్రిమూర్తులకు జన్మనిచ్చిన ఆదిశక్తిగా వర్ణిస్తారు.తారా రూపం చాలాసార్లు ప్రసన్నంగా, కరుణామయిగా, దయాస్వరూపిణిగా ఉంటుంది. ప్రపంచాన్ని ఉద్దరించటానికి వచ్చే ప్రవక్తలందరూ ఆమె బిడ్డలే అని బౌద్ధంలో భావిస్తారు.హిందూ తంత్రముల నుండి బౌద్ధ తంత్రముల లోనికి వెళ్లి అక్కడ అత్యున్నత స్థానాన్నిపొంది ఈనాటికి నేపాల్, టిబెట్, అస్సాం, హిమాలయ సానువులలో ఆరాధించబడుతున్న శక్తి–తార. మనదేశంలో తారాదేవి దేవాలయాలు బెంగాల్, అస్సాం, హిమాలయ ప్రాంతాలలోఉన్నాయి.
ఇక తారాపీఠ్ ఆలయానికి చేరుకోవాలంటే రైలు సౌకర్యం ఉంది. కలకత్తా ఎయిర్ పోర్టు నుంచి 216 కిలోమీటర్ల దూరం లో ఈ తారాపీఠ్ ఉంది. అక్కడ నుంచి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. తారా పీఠ్ కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రాంపుర్హాట్ రైల్వే స్టేషన్ నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆలయం పరిసరాల్లో హోటళ్లు కూడ ఉన్నాయి. వసతి సదుపాయానికి ఇబ్బంది లేదు.
Discussion about this post