తెలంగాణా లో ఎన్నికల సమయం ఆసన్నమైంది. నామినేషన్లు ముగిసాయి. రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని, ఓట్లు రాబట్టుకోవడానికి చేసే యత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే..ఇక ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది. సభలు .. సమావేశాలు ఊపందుకుంటున్నాయి. పనిలో పనిగా కుల సమీకరణ సభలు కూడా జరుగుతున్నాయి. ఎటు చూసినా వివిధ పార్టీల బ్యానర్లు .. కటౌట్లు .. నాయకుల.. కార్యకర్తల హడావుడి తో ఎన్నికల వాతావరణం కనబడుతోంది. చివరికి బ్రాందీ షాపులు ..బార్లు .. రెస్టారెంట్లు.. కల్లు కాంపౌండ్లు కూడా బిజీగా పనిచేస్తున్నాయి.
ఇక అధికార పక్షం ప్రచారంలో దూసుకుపోతోంది. విపక్షాలు సైతం ప్రచారంలో జోరు పెంచాయి. బీజేపీ తరపున ప్రధాని మోడీ ఇప్పటికే ఒక విడత ప్రచార సభ నిర్వహించారు.కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ,ప్రియాంక తదితరులు రెండు విడతల ప్రచారం నిర్వహించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్ సీఎం కేసీఆర్ రోజుకు మూడు సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలు ప్రజా సమీకరణ లో బిజీ గా మారారు. ప్రచార రథాల రాక, మైకుల మోత, నేతల పర్యటనలు, కార్యకర్తల హడావిడితో పల్లెలు పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల గడువు 20 రోజులే ఉండటంతో తెల్లవారింది మొదలు.. సాయంత్రం పొద్దుపోయేదాకా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు.
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల గెలుపోటములపై చర్చ మొదలైంది. ఇటు బెట్టింగ్‌లు కూడా మొదలు అయ్యాయి. అధికార పార్టీకి చెందిన మంత్రుల్లో బరిలోకి దిగిన వారి పరిస్థితి ఎలా ఉందో అన్న చర్చ మొదలైంది. కేసీఅర్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు పోటీలో లేరు. మిగిలిన వారంతా బరిలోకి దిగారు. కేటీఆర్, హరీష్ రావులను పక్కన పెడితే, మిగిలిన వారిపై చర్చ మొదలైంది. అటు కాంగ్రెస్ ,ఇటు బిజెపి పార్టీలు బరిలో ఉన్న మంత్రులపై బలమైన అభ్యర్థులను దింపి .. ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు మంత్రుల నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి వెళుతున్నారు.
మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డీ బరిలో ఉండడంతో నిర్మల్ నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇటు ప్రశాంత్ రెడ్డిపై సునీల్ రెడ్డి పోటీలో ఉండడంతో ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోటీకి దిగడంతో ఆ నియోజకవర్గం సెన్సేషనల్‌గా మారింది. ఇక ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గెలుపోటములపై చర్చలు మొదలు అయ్యాయి. ఇటు పువ్వాడ అజయ్‌పై కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తుండడంతో ఆ సీటు ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగి రెడ్డీ నిరంజన్ రెడ్డి పోటీలో ఉన్న నియోజకవర్గాల ఫలితాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న సనత్ నగర్, మల్లా రెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గాల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. గతం తో పోలిస్తే కాంగ్రెస్ బలం పుంజుకుంది. మరోవైపు నుంచి బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రుల్లో కొంత టెన్షన్ ఫీలవుతున్నారు. ఇక వీరి రాజకీయ భవిష్యత్ తేలాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే..!
Discussion about this post