ఇసైజ్ఞాని, మేస్ట్రో ఇళయరాజా జీవిత కథ తెరకెక్కబోతోందన్న వార్త మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన జీవిత కథ ఆధారంగా బయోపిక్ రానుందనే వార్త ఆ మధ్య కొంతకాలం వినిపించింది. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇళయరాజా వ్యక్తిగత, సంగీత జీవితాన్ని సినిమాగా తీయాలని బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కీ అనుకున్నారు. ఏడాది కిందట ఈ విషయాన్ని అయన వెల్లడించారు. ఇళయరాజా పాత్రలో ధనుష్‌ని చూడాలనుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.
ఇళయరాజా పాత్రను పోషించడానికి ధనుష్ అంగీకరించారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుందని, 2025లో విడుదల చేసే అవకాశం ఉందని చెబుతోంది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఆలోచన బయటపెట్టిన ఆర్.బాల్కీ గతంలో ధనుష్‌తో షమితాబ్ చిత్రం తీసిన సంగతి తెలిసిందే!
మేస్ట్రో ఇళయరాజా జన్మ నామం జ్ఞానదేశికన్. తమిళనాడులోని మధురై జిల్లా పన్నైపురంలో 1943 జూన్ 2న జన్మించారు. చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా సంగీత జీవితాన్ని ప్రారంభించారు. బెంగాలీ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి, కన్నడ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేష్ దగ్గర పని చేసారు. 1976లో అన్నక్కలి సినిమాతో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించారు.
వివిధ భారతీయ భాషలలో వందలాది సినిమాలకు సంగీతం అందించారు. భారతీయ సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఇళయరాజా నాలుగు సార్లు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2018 లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఆయనను బీజేపీ ప్రభుత్వం 2002 లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇళయరాజా, జీవా దంపతులకు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా.. కుమార్తె భవతారణి ఉన్నారు.
Discussion about this post