రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోడీ రూపంలో గట్టి పోరు ఎదురవుతోంది. రాష్ట్రంలో ప్రతీ ఐదేళ్లకోసారి అధికార మార్పిడి చేసే సంప్రదాయం ఉండటంతో ఈ అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేందుకు విపక్ష బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సీఎం అభ్యర్ధి ప్రకటించకుండానే బరిలోకి దిగి ప్రధాని మోడీనే ప్రధానంగా ఫోకస్ అవుతున్నారు.
రాజస్తాన్ అసెంబ్లీ పోరులో ఏడు గ్యారంటీలతో దిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకుంది. అయితే వీటిని కౌంటర్ చేసేందుకు కేంద్రంలో తమ పాలనను బీజేపీ గుర్తు చేస్తోంది. ఇందులో భాగంగా అశోక్ గెహ్లాట్ వర్సెస్ ప్రధాని మోడీ అన్నట్లుగా వాతావరణాన్ని మార్చేస్తోంది. బీజేపీకి సీఎం అభ్యర్ధి లేకపోవడంతో ప్రధాని మోడీ అంతా తానే అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు అశోక్ గెహ్లాట్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తద్వారా గెహ్లాట్ కూ, తనకూ మధ్య పోరు అన్నట్లుగా మోడీ ప్రచారం చేస్తున్నారు.
జాదూగర్ పేరుతో అశోక్ గెహ్లాట్ ను పదే పదే టార్గెట్ చేస్తున్న ప్రధాని మోడీ.. రాజస్తాన్ ఎన్నికల్లో తనను చూసి బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు. దీంతో బీజేపీ నేతలు కూడా ప్రధాని మోడీ ప్రచారాల్ని ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బీజేపీ సోషల్ మీడియా కూడా ప్రధాని మోడీ వ్యాఖ్యల్ని ఎక్కువగా హైలెట్ చేస్తోంది. అసలే రాజస్తాన్ లో ఒపీనియన్ పోల్స్ లోనూ ఈసారి బీజేపీకి మొగ్గు ఉండొచ్చన్న అంచనాలతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడుతోంది. ఇదే అదనుగా బీజేపీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.
తాజాగా అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ మధ్య వైరాన్ని ప్రధాని మోడీ పదే పదే ప్రస్తావిస్తున్నారు. పైకి వారిద్దరూ ఒకటే అన్నట్లుగా కనిపిస్తున్నా వారు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్ మెన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా వరల్డ్ కప్ సీజన్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Discussion about this post