అది కంపెనీ అయినా..పార్టీ అయినా కష్టపడి పనిచేసే వాళ్ళు కొంత మందే ఉంటారు. మరి కొంతమంది పని కంటే షో నే ఎక్కువ చేస్తుంటారు. విచిత్రం ఏమిటి అంటే రెండు చోట్లా అంటే అటు కంపెనీల్లో..ఇటు పార్టీల్లో కూడా కష్టపడి పనే చేసే వాళ్ల కంటే షో చేసే వాళ్ళు ఎక్కువ మైలేజ్ తీసుకుంటారు…అన్నిరకాలుగా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే .. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గురించి టీడీపీ లో ఇదే తరహా చర్చ జరుగుతోంది. చంద్రబాబు జైలు లో ఉన్న ఈ 52 రోజుల్లో పయ్యావుల కేశవ్ పట్టుమని ఐదు రోజులు మంగళగిరి పార్టీ కార్యాలయం వైపు వచ్చి ఉంటారేమో అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన సమయంలో అయన పార్టీ కోసం ఏమి చేశారో ఎవరికీ తెలియదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గత నెలలో పయ్యావుల కేశవ్ ములాఖత్ లో చంద్రబాబు తో కూడా సమావేశం అయ్యారు.
ఆ సందర్భంగా బయటకి వచ్చాక తనను చంద్రబాబు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కృష్ణా జలాల పరిస్థితి ఏంటి అని అడిగారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలని కోరినట్లు కేశవ్ వెల్లడించారు. కానీ పయ్యావుల కేశవ్ అటు కృష్ణా జలాల విషయంలో కానీ…ఆయన చెప్పిన ప్రజల సమస్యలపై జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నోరు విప్పి పెద్దగా మాట్లాడింది ఏమి లేదు అని పార్టీ నాయకులే చెబుతున్నారు. కానీ చంద్రబాబు విడుదల అయ్యే సమయానికి వచ్చి అయన కారు లో కూర్చుని కరెక్ట్ గా ఫోటో లో ఎలా ఉంటే పడతామో చూసుకుని ముందుకు వంగి మరీ కూర్చున్నారు అని ఒక నేత వ్యాఖ్యానించారు. కారు లోకి రమ్మని చంద్రబాబే పిలిచి ఉండొచ్చు కానీ…మార్కెటింగ్ చేసుకోవటం ఎవరైనా కేశవ్ దగ్గరనుంచే నేర్చుకోవాలని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. గత 52 రోజుల్లో బయట ఏమి జరిగిందో..ఎవరు ఎలా పని చేశారో వాస్తవాలు తెలుసుకుని చంద్రబాబు ఇకనైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుటుంది అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ‘పయ్యావుల కేశవ్’ విషయానికొస్తే ఆయనకు గతంలో చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు. 2020 లో బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కేశవ్ ఒకరు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ నుంచి 4000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంచి స్పీకర్ గా ఆయనకు పేరుంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడా ఆయన పేరు వినిపించడం లేదు. మనిషి వార్తల్లో కనిపించడం లేదు. అసలు తెలుగు దేశం పార్టీలో ఉన్నారా ? అనే సందేహాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. చంద్రబాబు పై అలిగారని , అసంతృప్తితో ఉన్నారని … అందుకే పార్టీ తో ఆంటీ ముట్టనట్టు ఉంటున్నారని ప్రచారం కూడా జరిగింది.
గతంలో టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లోఉన్న ప్రతిసారి కేశవ్ పార్టీకి , చంద్రబాబుకి అండగా నిలిచారు. కేశవ్‌ని పార్టీ నేతలు ఫైర్ బ్రాండ్‌గా పిలిచేవారు. పార్టీ యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కేశవ్. పార్టీకి సంబంధించిన మహానాడు కావచ్చు లేదా ఇతర సభల్లో కానీ కేశవ్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ దూసుకుపోయేవాడు. అలాంటోడు ఇపుడు సైలెంట్ అయిపోయాడనే విమర్శలు వినబడుతున్నాయి. కేశవ్ చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించారు. ఉరవకొండ నుంచి వరుసగా ఆరు సార్లు పోటీ చేసి, నాలుగుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు ఓడిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున గట్టిగా మాట్లాడే వారే లేరు. అలాంటి తరుణంలో పార్టీకి కేశవ్ ఎందుకు దూరంగా ఉంటున్నారు.? అసలు ఏం జరిగి వుంటుంది? అనే సందేహాలు చాలా మందిలో లేకపోలేదు.ఆయన అసంతృప్తికి అసలు కారణాలు వేరే ఉన్నాయి. అవి ఏమిటంటే ..
పయ్యావుల కేశవ్ 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ మంత్రి పదవి ఆశించారు. నిజానికి బాబు అనుకుని వుంటే ఆయనను మంత్రిని చేసి వుండేవారు. కానీ అలా జరగలేదు. 2019 ఎన్నికల్లో కేశవ్ గెలిచిన తర్వాత కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితోనే కేశవ్ దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది . తనకన్నా పరిటాల కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే విషయం కూడా కేశవ్ గమనించారని అంటారు. ఆనాడు అధినేత వ్యవహరించిన తీరు ఇప్పుడు కేశవ్ అంత చురుగ్గా వ్యవహరించక పోవడానికి కారణంగా చెబుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో పార్టీ వాణిని గట్టిగా వినిపించిన వ్యక్తికి తగు రీతిలో గౌరవం దక్కలేదనేది కేశవ్ అనుచరుల వాదన. కేశవ్ పై విమర్శలు గతంలో కూడా వచ్చాయి. ఆయన తీరు మారుతుందో లేదో చూడాలి.
Discussion about this post