బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరు ? దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ తరచుగా అక్కడికి ఎందుకు వెళతారు ? ఏమిటి ఆ గుహల ప్రాధాన్యత ? ఇలాంటి ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే.
ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహలున్నాయి . ఇక్కడే బాబాజీ అనే వ్యక్తి దీర్ఘకాలం తపస్సు చేశారట. ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? ఎక్కడి వాడో ఎవరికి తెలియదు. ఒక యోగిగా ఇక్కడ కొచ్చి తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారని అంటారు.
బాబాజీ తమిళనాడుకి చెందినవారని … చిన్న తనంలోనే ఇల్లు వదిలి వచ్చేశారని చెబుతారు. మార్షల్ గోవిందన్ రాసిన పుస్తకం ప్రకారం బాబాజీ అసలు పేరు నాగరాజ్…కడలూరు ప్రాంత వాసి. పదిహేనేళ్ల వయస్సులో సన్యాసుల సమూహంలో చేరారు . వారి దగ్గరే ఉండి బాబాజీ వేదాలు , ఉపనిషత్తులు … మహాభారతం , రామాయణం, భగవద్గీత వంటి పవిత్ర గ్రంధాలను అధ్యయనం చేశారు. అలా ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి తిరుగుతూ హిమాలయాల్లో ఉండిపోయారు. అక్కడే ధ్యానముద్రలో నిమగ్నమైనారు. బాబాజీ 1861-65 మధ్యకాలంలో చివరిసారి హిమాలయాల్లో కనిపించారని అక్కడి వారు చెబుతుంటారు
బాబాజీ గురించి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ‘క్రియా యోగం’, ‘క్రియా కుండలిని ‘ దీక్ష గురించి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ బాబాజీ యే అని ఆయన శిష్యులు చెబుతారు. ప్రస్తుతం బాబాజీ భౌతికంగా లేకపోయినా నిరాకార రూపంలో అక్కడే సంచరిస్తున్నారని భక్తులు నమ్ముతారు. ఆయన అమరుడై ఇక్కడే ఉన్నారని ప్రియమైన భక్తులకు కనిపిస్తుంటారని భక్తులు అంటుంటారు.
బాబాజీ తపస్సు చేసి తన శిష్యులకు ఉపదేశాలు ఇచ్చిన ప్రదేశం కావడంతో ఈ గుహలకు బాబాజీ గుహలు అనే పేరు వచ్చింది. బాబాజీ శిష్యుల్లో లాహిరీ ప్రధాన శిష్యుడు. 1861 లో లాహిరి కి బాబాజీ దర్శనం లభించింది. లాహిరీ ఆయన శిష్యుడిగా మారిపోయి క్రియా యోగ విద్యను అభ్యసించారు. ఆయనే ఈ గుహలు , క్రియాయోగం గురించి దేశానికి, ప్రపంచానికి పరిచయం చేశారు.కాలక్రమంలో ఆ గుహలు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాబాజీ గుహాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహల్లో సందర్శకులు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. కేవలం 8 మంది మాత్రమే అక్కడ ధ్యానం చేసుకునే అవకాశం ఉంది.
బాబాజీ గురించి పరమహంస యోగానంద “ఒక యోగి ఆత్మ” కథ అనే ఒక పుస్తకం రాశారు. యోగానంద గురువు యుక్తేశ్వర్ గిరి కూడా బాబాజీ గురించి తన పుస్తకం ‘ది హొలీ సైన్స్’ లో వివరించారు. యోగానంద ఆత్మకథ ప్రకారం, బాబాజీ హిమాలయ ప్రాంతాలలో కనీసం వందల సంవత్సరాలు నివసించారు, కొద్దిమంది శిష్యులు .. ఇతరులు మాత్రమే ఆయనను ప్రత్యక్షంగా చూశారుబాబాజీ గురించి విదేశీయులు ఎంతో మంది పుస్తకాలు రాశారు.
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన “బాబా” సినిమా లో ఈ బాబాజీ ప్రస్తావన ఉంది. హిమాలయాల్లో కనిపించే మహా పురుషుని రూపం పేరే బాబాజీ. రజనీ కాంత్ ప్రతి ఏటా ఇక్కడ కొచ్చి కొన్నాళ్ళు ధ్యానం చేసుకుంటారు. ఈ మధ్య కూడా వెళ్లి వచ్చారు. అలాగే కొంతమంది ఉత్తరాది సినీ తారలు , రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తుంటారు.
రాణిఖేత్ నుంచి కుకుచినా ప్రాంతానికి చేరుకుంటే …అక్కడికి దగ్గరలోనే బాబాజీ గుహలున్నాయి. ఈ కుకుచినా లో జోషీ రెస్టారెంట్ అనేది చాలా పాపులర్. అక్కడ బస చేయడానికి వసతి సౌకర్యం కూడా ఉంటుంది. ఆయనే యాత్రికులకు గైడెన్స్ ఇస్తుంటారు. జొషీ రెస్టారెంట్ నుంచి 3 కిలోమీటర్లు నడవాలి. గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బాబాజీ గుహలకు సులభంగా చేరవచ్చు. ఢిల్లీ నుంచి రాణికెత్ 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి ద్వారహాట్ 35 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడనుంచి కుకుచినా 20 కిలోమీటర్లు దూరం … కుకుచినా నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్న పాటి ట్రెక్కింగ్ లా ఉంటుంది.
సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు బాబాజీ గుహల సందర్శనకు అనువైన సమయం. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ..భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది ,,కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ..అదండీ బాబాజీ గుహల ప్రాధాన్యత.
Discussion about this post