సైబర్ నేరాలకు పాల్పడే వారి పాలిట సింహస్వప్నం ఆ యూనిట్. ఎంతో తెలివిగా సైబర్ క్రైమ్ చేశామని.. ఎవరూ తమను పట్టుకోలేరని బీరాలకు పోయేవారి ఆటలకు ఇట్టే చెక్ పెడుతుంది. ఇలాంటి వారిని జల్లెడ వేసి మరీ పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడుతోంది ఆ స్పెషల్ యూనిట్. ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్ పేరు.. ది ఇంటలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్. దీనినే సింపుల్ గా ఐఎఫ్ఎస్ఓ అని అంటారు. ఈ నేపథ్యంలో ఐఎఫ్ఎస్ఓ ప్రత్యేకలేమిటో తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.
టాప్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అవటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టాప్ సెలెబ్రిటీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వమూ సీరియస్ గా స్పందించింది. కేసు దర్యాప్తు బాధ్యతను ఐఎఫ్ఎస్ఓ చేపట్టింది. ఈ కేసులో ఐఎఫ్ఎస్ఓ అధికారులు బీహార్ కు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో సైబర్ నేరాలను నియంత్రించటానికి… తద్వారా దేశ భద్రత, దేశ ఆర్ధిక భద్రతలను పరిరక్షించటానికి ఢిల్లీ పోలీసులు తొలుత సైబర్ ప్రివెన్షన్ అవేర్నెస్ డిటెక్షన్… అంటే సైపాడ్ పేరిట ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా రాకేష్ ఆస్థానా ఉన్నపుడు దీనిని ఐఎఫ్ఎస్ఓ గా మార్చారు. సున్నితమైన, సంక్లిష్టమైన సైబర్ నేరాలను ఛేదించి నిందితులను పట్టుకుని న్యాయస్థానాల ముందు నిలబెట్టడమే దీని ప్రధాన విధి. ఆర్ధిక నేరాలతోపాటు మహిళలు, చిన్నారులు బాధితులుగా ఉన్న సైబర్ నేరాలలో కూడా ఈ విభాగమే దర్యాప్తు చేస్తుంది. ఇంటర్నెట్ దుర్వినియోగాన్ని నియంత్రిస్తుంది.
దేశంలో ఎంతో సంచలనం సృష్టించిన పలు సైబర్ నేరాలను ఐఎఫ్ఎస్ఓ ఇప్పటికే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కోర్టుల్లో హాజరుపరిచింది. ఈ విభాగం వద్ద అత్యాధునిక సైబర్ ల్యాబ్, సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ ఉన్నాయి. చైనా మొబైల్ ఫోన్స్ తో సహా అన్ని రకాల ఫోన్స్.. కంప్యూటర్ హార్డ్ డ్రైవ్స్ నుంచి డిలీట్ చేసిన డేటాను సైతం వెలికి తీయగల సామర్ధ్యం ఉంది.
ఇప్పటికే ఈ విభాగం దేశంలో ఎంతో సంచలనం సృష్టించిన హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేసి నిందితులను కటకటాల వెనక్కి నెట్టింది. రుణ యాప్ ల ద్వారా భారీ స్థాయిలో ఆర్ధిక అక్రమాలకు పాల్పడి.. ఎందరినో తీవ్ర వేధింపులకు గురి చేసిన ఇద్దరు నేరగాళ్ళను పట్టుకుంది. ముస్లిం యువతుల ఫోటోలను ఒక యాప్ లో పెట్టి వర్చ్యువల్ వేలం నిర్వహించటం ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించిన దుండగుడిని అరెస్ట్ చేసింది. మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో వైరల్ కావటానికి కారణమైన సీనియర్ రాజకీయ నాయకులపై సైతం కేసులు నమోదు చేసింది.
Discussion about this post