బహుత్ ప్యార్ కర్తే హై ముజ్ కో సనమ్…, ఏక్.. దో..తీన్.., చోళీకె పీచే క్యా హై… ఈ హిందీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ వినగానే అందాల తార మాధురీ దీక్షిత్ గుర్తొస్తారు. పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు తెరమరుగైన ఆమె మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగటానికి మాధురీ దీక్షిత్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారని చెబుతున్నారు.
నిజానికి ఆమె రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు 2019 లోనే వచ్చాయి. పూణే లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారని అప్పట్లో చెప్పుకున్నారు. కానీ చివరికి మాధురీ పోటీ చేయడం లేదని, రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఆమె ప్రతినిధి వివరణ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతోనే కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో మాధురీ టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటును కూడా ఎంచుకున్నారని జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
ఒకనాటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆమె బీజేపీ నేతలతో కలిసి కనిపించటానికి ఇదే కారణమని అంటున్నారు. ముంబైలో ఇటీవల జరిగిన వరల్డ్ కప్ ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు బీజేపీ నేత ఆశిష్ షెల్లార్ తో కలిసి ఆమె వచ్చారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తో కలిసి కనిపించారు.
మాధురీ దీక్షిత్ ఇదివరకు సినిమా విషయాలను మాత్రమే తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేసేవారు. కానీ ఈ మధ్య క్రికెట్ గురించి.. ప్రభుత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఆమె పొలిటికల్ ఎంట్రీ.. ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని అంటున్నారు.
1984లో మాధురీ దీక్షిత్ “అబోద్” సినిమాతో తేరంగేట్రం చేశారు. “తేజాబ్” సినిమాతో పాపులర్ అయ్యారు. తర్వాత “రాం లఖన్”, “పరిందా” , “త్రిదేవ్” , “కిషన్ కన్హయ్యా” “దిల్” , “సాజన్” , “బేటా” , “ఖల్నాయక్”, “హం ఆప్కే హై కౌన్” , “రాజా” .. “అంజాన్” వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు. వీటిలో హం ఆప్కే హై కౌన్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి వస్తే ..ఈ రంగంలోనూ హిట్ అవుతారా అనేది వేచి చూడాలి.
Discussion about this post