కోట్లాది మంది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు రంగం శరవేగంగా సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారయింది. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే ఆహ్వానం అందగా, దేశ విదేశాల్లో ఉన్న10 కోట్ల కుటుంబాలను ఆహ్వానించాలని విశ్వ హిందూ పరిషత్ నిర్ణయించింది. ఈ ఆహ్వాన కార్యక్రమానికి జనవరి 1న శ్రీకారం చుట్టనున్నారు.
మరోవైపు.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా దేవాలయాల్లో ఏక కాలంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా అయోధ్యలో నిర్వహించే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో ఇటీవల మొదలయ్యాయి. శ్రీరామ దర్బార్ లో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. పూజకు వినియోగించిన అక్షతలను దేశవ్యాప్తంగా ప్రజలకు వీహెచ్ పీ ప్రతినిధులు పంపిణీ చేయనున్నారు.
కాగా అయోధ్యలోని రామమందిరం కోసం, అక్కడ కొలువుదీరుతున్న శ్రీరాముని కోసం భక్తులు అరుదైన కానుకలను అందజేయనున్నారు. అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేసారు. ప్రపంచంలోనే ఇది చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళం కావడం విశేషం
రెండు లక్షల రూపాయల వ్యయంతో తయారుచేసిన ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. ఇక తాళం చెవి పొడవు నాలుగు అడుగులు. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరతరాలుగా తాళాల తయారీ వృత్తిలోనే ఉంది. తాళం తయారీలో సత్యప్రకాశ్ భార్య రుక్మిణి కూడా సాయం చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ భారీ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి అందజేయనున్నారు.
అలాగే గుజరాత్ లోని వదోదర జిల్లాకు చెందిన తర్సాలీ గ్రామం అయోధ్య రాముడికి ఓ గొప్ప కానుక ఇవ్వాలనుకుంది. భారీ అగర్బత్తీని తయారు చేసి అందించాలని సంకల్పించింది రాముడంటే అమితమైన భక్తి ఉన్న విహాభాయ్ అనే రైతు దీని తయారీకి పూనుకున్నారు.108 అడుగుల పొడవుగల అగర్బత్తీని తయారు చేస్తున్నారు. దీనికోసం 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవనం మెటీరియల్, 1475 కిలోల ఆవు పేడ పొడి తదితరాలను వినియోగిస్తున్నారు. దీంతో సుమారు 3,400 కిలోల బరువు ఉన్న అగర్బత్తీ సిద్ధమవుతోంది. ముడి సరుకును, ఉపయోగించే పదార్థాలను గ్రామస్తులు సమకూర్చారు. డిసెంబర్ లో భారీ ఊరేగింపుతో ఈ అగర్బత్తీని అయోధ్యకు తరలిస్తామని గ్రామస్తులు చెప్పారు.
Discussion about this post