రాములమ్మగా అభిమానులు పిలుచుకునే బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మనసులో ఏముందన్న చర్చ రాజకీయ వర్గాలలో ప్రారంభమైంది. తాజాగా రాములమ్మ చేసిన ట్వీటే దీనికి కారణం. 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకెప్పుడూ సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని, ఏ రోజూ పదవిని కోరుకోలేదని ఆ ట్వీట్ లో ఆమె తెలిపారు. తన పోరాటం తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమేనని చెప్పారు.
కేసీఆర్ కుటుంబ దోపిడీ, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, తనతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని రాములమ్మ స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలని మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం.. ఎప్పటికీ… అని ఆమె చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో విజయశాంతి ఈ విధంగా ట్వీట్ చేయడంపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొందరు నేతల తీరుపైనే ఆమె మండిపడటం బీఆర్ఎస్ కార్యకర్తలకు సానుకూలంగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తోంది.
విజయశాంతి కొంతకాలంగా బీజేపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని, తన శక్తి సామర్థ్యాలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఒక దశలో ఆమె పార్టీ వీడతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే రాములమ్మను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీ నిరసనల కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. తాజాగా విజయశాంతి చేసిన ట్వీట్ లో బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రస్తావించడంతో ఆమె ఉద్దేశం ఏంటనే దానిపై బీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు.
Discussion about this post