ఇండియా లో టీ టూరిజం మెల్లగా ఊపందుకుంటోంది. టీ గార్డెన్స్ ను సందర్శించడం … టీ తోటల పెంపకాన్ని.. ప్రాసెసింగ్ ను గమనించడం ..మధురమైన తేనీరును సేవిస్తూ అక్కడి ప్రకృతి అందాలను తిలకించడమే టీ టూరిజం. టీ టూరిజం కొత్త రుచులను ఆవిష్కరిస్తూనే టీ ఎలా తయారవుతుందో తెలుసుకునే అవకాశాన్నిపర్యాటకులకు అందిస్తుంది. టీ టూరిజం గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పుంతలు తొక్కుతూ దూసుకుపోతోంది. తేయాకు తోటలకు సమీపంలో రిసార్ట్స్ కూడా వెలుస్తున్నాయి. డార్జిలింగ్, అసోం , నీలగిరి కొండలలో ఉన్న తేయాకు తోటలను సందర్శిస్తే బిజీ లైఫ్ నుంచి ప్రశాంత వాతావరణం లో సేద తీరవచ్చు.
ఇండియాలో ప్రధానంగా డార్జిలింగ్,అసోం,నీలగిరి ప్రాంతాల్లో తేయాకు తోటలను పండిస్తున్నారు. దేశంలో లభించే తేయాకు ని అస్సాం టీ , డార్జిలింగ్ టీ, నీలగిరి టీ అని మూడు రకాలుగా వర్గీకరించారు. డార్జిలింగ్ … ఈ ప్రాంతం పశ్చిమ బెంగాల్ లో ఉంది. పెద్ద హిల్ స్టేషన్ ఇది. దీన్ని తేయాకు స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం లో అబ్బురపరిచే తేయాకు తోటల సౌందర్యాన్ని కళ్లారా చూసి తీరాల్సిందే. ఈ ప్రాంతంలో 1854లో ఆంగ్లేయులు తేయాకు తోటల పెంపకం చేపట్టారు. ఆ తర్వాత కలకత్తా లోని ధనికులైన కొంతమంది ఈ తోటల పెంపకాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద టీ గార్డెన్ . మార్చ్ నుంచి నవంబర్ వరకు తేయాకు సేకరణ పనులు జరుగుతాయి. కాబట్టి ఈ మాసాలలో ఈ గార్డెన్ ను సందర్శించవచ్చు. ఆ సమయంలో వాతావరణం .. ఆహ్లదకరంగా .. అనుకూలంగా ఉంటుంది.
ఈ ప్రాంతంలో 87 టీ ఎస్టేట్లు ఉన్నాయి. వ్యవసాయ సహకార సంస్థల కింద కూడా కొన్ని తోటలు పెంపకంలో ఉన్నాయి. పెద్ద టీ కంపెనీలకు ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా కొన్ని భూములున్నాయి. వీటిని లీజుకు ఇస్తుంటారు. పర్మనెంట్ కార్మికులు ఎస్టేట్లలో శాశ్వత నివాసితులు కావచ్చు, ఇక్కడ ప్లాంటేషన్ లేబర్ కు చట్టం ప్రకారం గృహాలు, విద్య, ఆరోగ్యం, ఇతర సేవలు ఎస్టేట్ యాజమాన్యం ద్వారా అందుతాయి.
తమిళనాడు లోని నీలగిరి కొండలు తేయాకు పంటలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ సుమారు వంద సంవత్సరాల నుండి అద్భుత సువాసన గల తేయాకు తోటలు సాగు చేస్తున్నారు. వివిధ రకాల తేయాకు ఇక్కడ పండుతుంది. ఇక్కడ 16 టీ కంపెనీలు తేయాకు సాగులో నిమగ్నమయ్యాయి . సందర్శకులు నీలగిరి లో అందమైన ఎన్నో టీ ఎస్టేట్ లను చూడవచ్చు. తమిళనాడులోని పశ్చిమ కనుమలలో ఒక భాగం నీలగిరి. నీలగిరి అందాలను చూస్తూ ట్రెక్కింగ్ చేయడం కొత్త అనుభూతిని ఇస్తుంది.
నీలగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు కాఫీ తోటలు, నారింజ తోటలు, టీ తోటలు, పైన్ చెట్లు కనిపిస్తాయి. మోయర్ నది వద్ద టీ ఎస్టేట్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.కేథరీన్ జలపాతం,ఎల్క్ జలపాతం కనువిందు చేస్తాయి. అలాగే కేరళ లోని మున్నార్ ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ కూడా చాలా టీ గార్డెన్ లు ఉన్నాయి. చక్కని వాతావరణం, సుందరమైన పరిసరాలు మున్నార్ ను పర్యాటక కేంద్రం గా మార్చాయి. మున్నార్ వెళ్లే పర్యాటకులు అక్కడి తేయాకు తోటలు తప్పక సందర్శించి తీరాలి.
మన దేశంలో అసోం రాష్ట్రం అతి పెద్ద తేయాకు ఉత్పత్తి రాష్ట్రంగా పేరు సంపాదించింది..భారతదేశంలోని టీలో సగానికి పైగా అసోం నుంచే ఉత్పత్తి అవుతుంది. 1862 నాటికి అస్సాం లో దాదాపు 160 తోటలున్నాయి. ఈ అసోం ప్రాంతం సాలీనా 400 మిలియన్ కిలోల కంటే ఎక్కువ టీని ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద టీ-ఉత్పత్తి ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశీయంగా వాణిజ్య మార్కెట్లో అసోం టీ బాగా ప్రాచుర్యం పొందింది. భారతీయులందరూ దీన్ని ఇష్టపడతారు. అసోం లోని ఉత్తర బ్రహ్మపుత్ర వ్యాలీ, కాబ్రి, కచ్చర్ హిల్స్, బరాక్ వ్యాలీ ప్రాంతాల్లో విస్తారంగా తేయాకు తోటలున్నాయి..
అసోం లోని జోర్హాట్ లో ప్రతి సంవత్సరం ‘ టీ ఫెస్టివల్ ‘ నిర్వహిస్తారు. దీనికి వేలాది పర్యాటకులు వచ్చి వెళతారు. తేయాకు సాగు, కోత, ప్యాకింగ్ పంపిణీ, మార్కెటింగ్ ప్రక్రియలలో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తేయాకు రుచి శీతోష్ణస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అస్సాంలో పెంచిన తేయాకుకి, డార్డిలింగ్లో పెంచిన తేయాకుకి నాణ్యతలోను, రుచిలోను చాలా వ్యత్యాసం ఉంటుంది. తేయాకులో కనీసం 3000 రకాలున్నప్పటికీ అవన్నీ ప్రధానంగా 6 మౌలిక రకాల నుంచి పుట్టుకొచ్చినవే. అస్సాం తేయాకు మనోహరి బ్రాండ్ కిలో లక్షరూపాయలు ధర పలికి రికార్డు సృష్టించింది.
కంగ్రా టీ కూడా చాలా పాపులర్ బ్రాండ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా వ్యాలీ అంతటా టీ తోటలు సేంద్రీయ పద్ధతుల్లో సాగవుతుంటాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీకి ఈ ప్రాంతం అంతర్జాతీయంగా ప్రసిద్ధి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఉత్తర భారతదేశం 59.16 మిలియన్ కిలోల తేయాకును ఎగుమతి చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 0.12 శాతం ఎక్కువ.దక్షిణాది నుంచి టీ ఎగుమతి 2.25. శాతం క్షీణతతో 38.19 మిలియన్ కిలోలకు పరిమితమైంది. భారత్ ప్రపంచంలోనే రెండో పెద్ద తేయాకు ఎగుమతిదారుగా నిలిచింది. అదండీ టీ టూరిజం .. తేయాకు తోటల కథ.
Discussion about this post