భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థే పూర్తిగా అమలైతే రైలు ప్రమాదాలు జరగవని రైల్వే భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇది ఇప్పటికే జరిగి ఉంటే జూన్ లో ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద, ఆదివారం విజయనగరం జిల్లాలోను ఘోర రైలు ప్రమాదాలు జరిగేవి కాదని వారు అంటున్నారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ద్వారా భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరే ‘కవచ్’. ఈ సిస్టమ్ కి 2011-12 లో శ్రీకారం చుట్టగా 2019లో దీనికి ‘కవచ్’ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ‘కవచ్’ కొన్ని లైన్లు, రైళ్లలోనే ఉంది.
భారతీయ రైల్వే 2022లో ‘కవచ్’ వ్యవస్థ అభివృద్ధిని పూర్తి చేసింది. ప్రమాదాలను పూర్తిగా నివారించడం ఈ వ్యవస్థ లక్ష్యం. ఇది అమల్లో ఉన్న లైన్లు, రైళ్లలో ప్రమాదం జరగటానికి అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు రైలు ముందుకు వెళ్లకుండా నిరోధించడం.. అతి వేగాన్ని నిరోధించడం కోసం ఆటోమాటిక్ గా బ్రేక్స్ వేయడం.. లెవల్ క్రాసింగ్ సమీపించినప్పుడు ఆటోమాటిక్ గా హారన్ మోగించడం, కవచ్ వ్యవస్థలు కలిగి ఉన్న రెండు రైళ్లు ఢీకొనకుండా నివారించడం. అత్యవసర పరిస్థితిలో ఎస్ఓఎస్ మెస్సేజులు పంపించడం. నెట్వర్క్ మానిటర్ సిస్టమ్ ద్వారా రైళ్ల కదలికలన్నింటిపైనా కేంద్రీకృత పర్యవేక్షణ ఉండటం కవచ్ వ్యవస్థలో ప్రధాన అంశాలు.
దీనిని 2022 మార్చి 4న సికింద్రాబాద్ డివిజన్లో తొలిసారి పరీక్షించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ కొన్ని జోన్లలోనే అందుబాటులో ఉంది. దేశంలో 13 వేలకు పైగా ప్రయాణికుల రైళ్లు ఉండగా కేవలం 65 రైళ్లలో దీనిని ఏర్పాటు చేశారు. తొలి దశలో అత్యధిక రద్దీ ఉండే న్యూఢిల్లీ –ముంబై, న్యూ ఢిల్లీ – హౌరా మార్గాలతో పాటు 34 వేల కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 1445 కిలో మీటర్ల మేర మాత్రమే ఏర్పాటు చేసారు.
Discussion about this post