మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల జంట తాజాగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్ కు పయనమవటం హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వారు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో డెహ్రాడూన్ కు కొత్త జంట ఎందుకెళ్లిందన్న ఆసక్తి నెటిజన్లకు కలిగింది. వారిద్దరూ హానిమూన్ కేమైనా వెళ్తున్నారా అని ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటకొచ్చింది.
ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒకింటి వారయిన సంగతి తెలిసిందే. ఇటలీలోని వెడ్డింగ్ డెస్టినేషన్ టుస్కానీలో వీరి పెళ్లి వేడుకగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్, నితిన్, ఇంకా అత్యంత సన్నిహితులు, స్నేహితులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
అక్టోబర్ 30న మొదలైన వివాహ వేడుకలు మూడు రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన వరుణ్ తేజ్- లావణ్య టాలీవుడ్ ప్రముఖుల కోసం 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు.
మెగా కుటుంబ సభ్యురాలిగా లావణ్య దీపావళి వేడుకలను హ్యాపీగా జరుపుకుంది. భర్త వరుణ్, ఆడపడుచు నిహారిక, మామగారు నాగబాబులతో కలిసి సరదాగా బాణాసంచా కూడా కాల్చింది. తాజాగా లావణ్య, వరుణ్, నిహారిక కలిసి డెహ్రాడూన్ వెళ్తూ హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి యూపీలోని ఫైజాబాద్‌లో పుట్టినప్పటికీ బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్లోనే ఉన్నారు. ప్రస్తుతం లావణ్య పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు. లావణ్య తరఫు బంధువులకు రిసెప్షన్ ఇచ్చేందుకే కొత్త జంట అక్కడికి పయనమైందని చెబుతున్నారు.
Discussion about this post