నవంబర్ 30వ తేదీన తెలంగాణ యావత్తూ ఓటెత్తనుంది. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కొన్నిచోట్ల బరిలో నిల్చున్న అభ్యర్థులపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ సారి జరగనున్న ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య భీకర పోరు జరగనుంది. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ ఏమేరకు క్యాష్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నేతల మధ్య మాటల తూటాలు హద్దులు దాటి పేలుతున్నాయి. అయితే ఈసారి తెలంగాణలో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,62,98,418 మంది పురుష ఓటర్లు, 1,63,01,705 మంది మహిళా ఓటర్లున్నారు. పురుష ఓటర్లను సంఖ్యాపరంగా మహిళా ఓటర్లు మించిపోవడం ఇది తొలిసారి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ పురుష ఓటర్లే అధికంగా ఉండేవారు. ఇక ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,676 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇక ఈ ఎన్నికల నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల కమిషన్.. ట్రాన్స్ జెండర్‌ల ఓటు నమోదు కోసం అన్ని జిల్లాల్లో క్యాంపులను నిర్వహించింది. ఇక థర్డ్ జెండర్ జాబితాలో చేరేవారి సంఖ్య ఈ ఏడాది జనవరి 5న 1952 ఉండగా అది అక్టోబర్ నెలకు 2,556కు పెరిగింది. నవంబర్ 10 నాటికి ఓటు కోసం నమోదు చేసుకున్న థర్డ్ జెండర్ సంఖ్య 2676కు పెరిగింది. ఇక 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండి ఓటుకోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య 9,99,667 ఉంది. అంటే మొత్తం ఓటర్ల సంఖ్యలో ఈ వయసు మధ్య ఉన్నవారి శాతం 3.06గా ఉంది. మొత్తంగా జనవరి 2023 నుంచి ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య 8.75 శాతం మేరా పెరిగింది. రాష్ట్రంలో 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 4,40,371 ఉండగా ఓటు హక్కు కలిగిన దివ్యాంగులు 5,06,921 మంది ఉన్నారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఉండవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పారు.ఇక ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు electoralsearch.eci.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాల్సిందిగా కోరారు. ఓటర్లు Voter helpline app ద్వారా కూడా తమ పోలింగ్ స్టేషన్‌ను తెలుసుకోవచ్చని వివరించారు
























Discussion about this post