హైదరాబాద్ లోని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంటారు. ఫక్తు హిందూ వాది అయిన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగడం వల్లే బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రాజా సింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసింది. మళ్ళీ ఆయనకే గోషా మహల్ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తాజాగా రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇదే విషయాన్ని గతంలోనూ ఆయన చెబుతూ పోలీసులకు సమాచారం ఇచ్చారు కూడా. ఇప్పుడు మళ్ళీ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. అంతే కాకుండా ఎన్నికల ప్రచారం నిమిత్తం తన నియోజకవర్గానికి రానున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ను కూడా తనతో పాటు చంపుతామని కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.
రాజా సింగ్ మాటలతో తరచూ వివాదాలు రేగుతుంటాయి. మొన్న ఆగష్టు నెలలో మహమ్మద్ ప్రవక్తపై అయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజా సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. పరిస్థితి విషమించే అవకాశం ఉండటంతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసారు. ఈ వివాదం కారణంగానే బీజేపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెబుతూ 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు కూడా జారీ చేసింది.
శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. ఇండియా హిందూ దేశంగా అవతరిస్తే ..ఇద్దరు పిల్లలే ఇంటికి ముద్దు.. విధానాన్ని పాటించే వారికే ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి సంచలనం సృష్టించారు. ఇలా తరచూ వివాదాలతో వార్తల్లో వుండే రాజా సింగ్ గోషా మహల్ నియోజకవర్గం నుంచి మళ్ళి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో .. వేచి చూడాలి.
Discussion about this post