తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు.. ఇది భర్తృహరి సుభాషితాల్లోని ఒక వాక్యం. ప్రయత్నించి ఇసుక నుంచి నూనె తీయవచ్చని దీని అర్ధం. దీనిని బాగా వంట పట్టించుకున్నవారు కొందరుంటారు. ఇలాంటివారే డబ్బు సంపాదించటానికి కొత్త కొత్త మార్గాలను వెతుకుతుంటారు. ఈ కోవలోకి వస్తున్నాయి కొన్నిపెళ్లి జంటలు. తమ పెళ్లి వేడుకల టిక్కెట్లను విదేశీయులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. దీనిని వెడ్డింగ్ టూరిజంలో భాగం చేసేస్తున్నాయి.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, ఇక్కడి ఆచార వ్యవహారాలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే విదేశీయులు ఇండియాలోని పండగలు, పబ్బాలు.. యాత్రలు.. జాతరలు, వేడుకలపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్లలో శాస్త్రోక్తంగా జరిగే పెళ్లి వేడుకలను దగ్గరుండి చూసేందుకు విదేశీయులు ఈ మధ్య ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారు. వేడుకల్లో వడ్డించే రుచికరమైన భారతీయ వంటకాలను ఆరగించేందుకు తహతహలాడుతున్నారు.
వెడ్డింగ్ టూరిజంలో భాగమైన ఈ టూర్లకు ఎంత ఖర్చైనా విదేశీయులు వెనకాడటం లేదు. ఈ అభిరుచినే కొందరు వధూవరులు, వెడ్డింగ్ ప్లానర్స్ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం స్పెషల్ వెబ్‌సైట్లూ నడుపుతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను టికెట్‌గా చూపిస్తూ నిశ్చితార్థం నుంచి, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా ఒక్కో వేడుకకి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు.
పెళ్లి ఖర్చులో ఎంతో కొంత తిరిగి వస్తుందని, విదేశీయులు వస్తే స్టేటస్ పెరుగుతుందని భావిస్తున్న వధూవరులు సొంతంగా జాయిన్ మై వెడ్డింగ్ పేరుతో అకౌంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో పెళ్లికొడుకు, పెళ్లికూతురి ఫోటోలు, పెళ్లి తేదీ, ఎన్నిరోజులు వేడుకలు జరుగుతాయి.. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు… వంటి వివరాలను పెడుతున్నారు. పెళ్లిలో ఉండే విందు, వినోదాల వివరాలను ఇస్తున్నారు. డ్రెస్ కోడ్, అక్కడ మాట్లాడే భాష, డెస్టినేషన్ అడ్రెస్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్లను పెడుతున్నారు. దేనికెంత టికెట్ రేట్ అనేది కోట్ చేస్తున్నారు.
ఒక రోజు వేడుకల్లో పాల్గొనాలంటే కనీసం 150 డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే పన్నెండు వేల రూపాయలకుపైనే చెల్లించాలన్నమాట. అదే రెండు రోజులకైతే 250 డాలర్లు చెల్లించాలి. ఒక వేళ ఐదు రోజుల పెళ్లిలో పాల్గొనాలంటే మాత్రం ప్రత్యేక వెడ్డింగ్ ప్యాకేజీ టికెట్ కొనాల్సిందే. విదేశీ అతిథులు ఎక్కువమంది వస్తే పెళ్లి ఖర్చుల్లో చాలావరకు తిరిగి వస్తోందని వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. దీంతో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న వారు ఈ ట్రెండ్ ను ఫాలో అవటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
హంగేరియన్ – ఆస్ట్రేలియన్ సంతతికి చెందిన ఒర్సి పర్కాణి తొలిసారి 2016లో ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. మరోవైపు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్వయంగా వెడ్డింగ్ టూరిజంను ప్రారంభించింది. బీచ్ వెడ్డింగ్, నేచర్ వెడ్డింగ్, రాయల్ వెడ్డింగ్, హిమాలయన్ వెడ్డింగ్ థీమ్‌ల పేరిట ప్రచారం నిర్వహిస్తోంది.
విదేశీయులను పెళ్లికి పిలవడమేగాక, అతిథి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవడం వెడ్డింగ్ టూరిజం ప్రత్యేకత. వేడుకలో జరిగే ప్రతి తంతు గురించి పర్యాటకులకు వివరించటానికి, వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా సెర్మనీ గైడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలలో ఈ వెడ్డింగ్ టూరిజం పెరుగుతోంది. జోధ్ పూర్, జైపూర్, జైసల్మేర్, ఉదయ్‌పూర్‌లలో జరిగే రాయల్ ఇండియన్ వెడ్డింగ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు.
Discussion about this post