జ్వరం, కీళ్ళ నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పెట్టే చికెన్‌గున్యాకు టీకా వచ్చేసింది. యూరప్‌కు చెందిన వాల్నెవా సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీనికి ‘ఇక్స్చిక్’ అని పేరు పెట్టారు. 18 ఏళ్ళు పైబడి, ఈ వ్యాధి బారినపడటానికి అవకాశం ఎక్కువగా ఉన్నవారికి దీనిని ఇవ్వడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. ఈ టీకాను సింగిల్ డోస్‌గా ఇస్తారు.
ఏడిస్ ఈజీప్టీ, ఏడిస్ అల్బోపిక్టస్ జాతికి చెందిన దోమలు చికెన్‌గున్యా వైరస్‌ను వ్యాప్తి చేస్తుంటాయి. చికెన్‌గున్యా కారణంగా జ్వరం, కీళ్ళ నొప్పులు తీవ్రంగా వస్తాయి. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు ఇది ప్రాణాంతకమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షల 40 వేల చికెన్‌గున్యా కేసులు నమోదైతే, 350 మంది మరణించారని నివేదికలు చెపుతున్నాయి. చికెన్‌గున్యా చికిత్సకు ఇప్పటిదాకా నిర్దిష్టమైన ఔషధాలు లేవని వైద్యులు చెబుతున్నారు.
చికెన్‌గున్యా వైరస్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుందని వైద్యులు తెలిపారు. ప్రత్యేకించి వృద్ధులలోనూ, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో ఈ సమస్యలు ఎక్కువవుతాయని వివరించారు. దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు లాంటి లక్షణాలు నెలల నుంచి సంవత్సరాల తరబడి వేధిస్తాయని వెల్లడించారు.
చికెన్‌గున్యాను 1952లో టాంజానియాలో కనుగొన్నారు. దీనికి కారణమయ్యే వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయని ఎఫ్‌డీఏ తెలిపింది. ఈ ఏడాది బ్రెజిల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో 2,18, 613 కేసులు నమోదవ్వగా, భారతదేశంలో 93 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇది అంటువ్యాధి కాకపోవడం వల్ల వ్యాప్తి ప్రమాదం తగ్గిందని వైద్య పరిశోధకులు చెప్పారు. ఇప్పుడు టీకా అందుబాటులోకి వస్తుండటంతో భవిష్యత్తులో కేసులు తగ్గవచ్చని చెబుతున్నారు.
Discussion about this post