సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’ త్వరలో థియేటర్లలో విడుదల కాబోతుంద. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే సంచనాలు సృష్టించిన విషయం తెలిసిందే.ఆంధప్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరెకెక్కింది. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలతో ఈ సినిమా కథను వర్మ రూపొందించారు. దీంతో ఈ సినిమా పై సహజంగానే అటు సినీ ప్రేక్షకులతో పాటు, రాజకీయ నాయకుల్లోనూ ఉత్కంఠను పెంచేసింది.
వివాదాలకు పెట్టింది పేరైన వర్మ.. కొత్త చిత్రం వ్యూహం కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో ఈ సినిమా చుట్టూ రాజకీయాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండు భాగాలుగా గా విడుదల చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ సినిమాలో చంద్రబాబు,నారాలోకేష్ .. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా, వైఎస్ జగన్ సతీమణి భారతి తదితర పాత్రలున్నాయి. ఇక వ్యూహం సినిమాలో తన పాత్రను అసభ్యంగా చిత్రీకరించారంటూ వర్మకు డిఫమేషన్ నోటీసులు పంపించారు లోకేష్.
వ్యూహం సినిమా చంద్రబాబును కించపరిచేలా.. టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్‌కు లోకేష్ లేఖ రాశారు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించేలా సినిమా ఉందనీ.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ లేఖ రాశారు.. దాంతో సెన్సార్ బోర్డ్ అనుమతి లభించకపోవడంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ప్రస్తుతం రివైజింగ్ కమిటీ వ్యూహం సినిమా చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పరిణామాల క్రమంలో నవంబర్ 10 న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది.
రివైజింగ్ కమిటీ నిర్ణయం వెల్లడి అయ్యాక కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని ఆర్జీవీ అంతకుముందు స్పష్టం చేశారు.అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇస్తుందా లేదా అన్న అనుమానాలు ఉన్న తరుణంలో దర్శకుడు రామ్‌గోపాల వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆసక్తిని పెంచేసింది. వ్యూహం త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతుంది అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఒక వేళ సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వక పోతే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకునే ప్రయత్నాలు చేయవచ్చని తెలుస్తోంది. గతంలో ‘ఉడ్తా పంజాబ్, పద్మావతి ‘ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా నిర్మాతలు రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
Discussion about this post