తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ వేసిన బీసీ పాచిక పారుతుందా.. ఆ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్రంలో బీసీలు 52 శాతానికి పైగా ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో .. ఎన్నికలలో బీజేపీని గెలిపిస్తే సీఎం పోస్టును బీసీ నాయకుడికి ఇస్తామని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకుడు.. ఎంపీ కే.లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన పార్టీకి సానుకూల ఫలితాలను రాబడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
తెలంగాణలో అనేక కారణాల వల్ల బీసీలకు ముఖ్యమంత్రి పీఠం దక్కట్లేదు. ఇప్పుడు బీజేపీ బీసీ సీఎం అస్త్రాన్ని సంధించింది. కానీ.. ఈ హామీ ఇచ్చినంత మాత్రాన బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పలేమని అంటున్నారు. ఆ పార్టీ ప్రచారంలో వెనుకపడిందని, ఇంకా మేనిఫెస్టోను ప్రకటించలేదని అభ్యర్థుల ఎంపిక ఇప్పటికీ పూర్తి చేయలేదని చెబుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్, కాంగ్రెస్.. నువ్వా-నేనా అని తలపడుతున్నాయి.
బీజేపీ నాయకులు తమ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తమ పార్టీ గెలిస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్… రెండు సార్లూ హ్యాండిచ్చారని గుర్తు చేసారు. కీలకమైన అధికార పదవులు, పార్టీ పోస్టులన్నీ తన కుటుంబ సభ్యులకే కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ ను గెలిపిస్తే మళ్లీ అదే జరుగుతుందని చెప్పారు. అయితే వీరి వాదన ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు.
ఒకవేళ బీజేపీకి అధికారం దక్కితే.. ఆ పార్టీ నుంచి సీఎం అయ్యే బీసీ నాయకుడు ఎవరనే ప్రశ్న కీలకంగా మారింది. ప్రస్తుతం ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలోనూ ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Discussion about this post