సీపీఎంతో దోస్తీ కట్ అవడంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది . ఇందులో భాగంగా టీజెఎస్ తో దోస్తీకి చెయ్యిచాచింది. దీనిపై రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.. కేసీఆర్ గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయడానికి సిద్దమని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీని ఏర్పాటు చేసి.. ముందుండి నడిపించిన టీజేఎస్ తరువాత కాలంలో రాజకీయ అరంగేట్రం చేసింది. అయితే ఏ ఎన్నికల్లోను గెలవలేకపోయింది. అయినా కూడా తనకంటూ కొంత ఓటు బ్యాంకు ఉండటంతో కాంగ్రెస్ ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్దమైంది.. ఇదే విషయమై రేవంత్ రెడ్డి కోదండరామ్ తో భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసం వారి సంపూర్ణ మద్దతు కోరామని రెండు పార్టీలూ కలిసి పనిచేసేందుకు ఓ సమన్వయ కమిటీ వేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని రేవంత్ తెలిపారు. డిసెంబర్ 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి కోదండరామ్ సలహా సూచనలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
సీఎం కేసీఆర్ 9న్నర ఏళ్ల నిరంకుశ పాలనను ఓడించడానికి తాను కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నట్లు కోదండరామ్ తెలిపారు.తాను 6 ప్రతిపాదనలు పెట్టానని దానికి వారు సానుకూలంగా స్పందించారన్నారు. అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పించాలని కోరాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు న్యాయం చెయ్యాలని కోరాం. అలాగే సంప్రదాయ వృత్తుల వారికీ, చిన్న సన్నకారు రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి ప్రణాళికలు రూపకల్పన చేయనున్నారు. రాజ్యాంగ విలువలతో అన్ని వర్గాల వారికీ అభివృద్ధి జరిగేలా ప్రభుత్వ మనుగడ సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.
ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అధికారంకోసం ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతోంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడుచుకోకూడదని … ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనే పంథాలో పోతోంది… మరి వీరి ప్రయత్నాలు సాకారం అవుతాయా లేదో అనేది డిసెంబర్ 3వరకు వేచి చూడాలి.
Discussion about this post