ప్రపంచంలో మనుషులకు ఎన్నెన్నో అభిరుచులు. రికార్డులు సృష్టించడమంటే కొందరికి ఎంతో ఇష్టం. ఆ కోవలోకే వస్తుంది ‘ది అమెరికన్ డ్రీమ్’ కారు తయారీ. ఈ వెహికల్ లో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ ఇన్నీకావు. అత్యంత విలాసవంతమైన, పొడవైన కారుగా ఈ కార్ రికార్డు సృష్టించింది తొలి వెర్షన్ పొడవు 60 అడుగులు ఉండగా తాజా మోడల్ 100 అడుగుల పొడవు, సరికొత్త అదనపు హంగులతో ఆశ్చర్యపరుస్తోంది.
స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ వంటి అదనపు సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ వెహికల్.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా పేరు పొందింది. 100 అడుగుల 1.5 అంగుళాల పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకొంది. కారుకు సంబంధించిన ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. ఇవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తొలి వెర్షన్ కారును 1986లో కాలిఫోర్నియాలోని బర్ బ్యాంక్‌కి చెందిన జే ఓర్‌బర్గ్ తయారు చేశారు. అప్పట్లో ఈ కారు 60 అడుగుల పొడవు, 26 చక్రాలతో ఉండేది. ముందు, వెనుక భాగంలో V8 ఇంజిన్లు ఏర్పాటు చేశారు. కొత్త కారుకు అదనపు హంగులు జోడించారు. దీంతో దీని పొడవు 100 అడుగులకుపైగా పెరిగింది.
“ది అమెరికన్ డ్రీమ్” కారును రెండు వైపుల నుంచి నడపవచ్చు. రెండు భాగాలుగా దీన్ని రూపొందించారు. మధ్యలో కీలులాంటి భాగంతో జోడించి.. మూలల్లో సక్రమంగా తిరిగేలా ఏర్పాటు చేసారు. కారులో పెద్ద వాటర్‌బెడ్, డైవింగ్ బోర్డ్‌తో కూడిన స్విమ్మింగ్ పూల్, బాత్‌టబ్, మినీ-గోల్ఫ్ కోర్స్, హెలిప్యాడ్ అందుబాటులో ఉన్నాయి. హెలిప్యాడ్‌ను కారుకు ఉక్కు బ్రాకెట్లతో అమర్చారు. 2270 కిలోల బరువు గల హెలికాఫ్టర్ ను అమెరికన్ డ్రీమ్ కారు మోయగలదు.
ఈ పొడవైన కారులో రిఫ్రిజిరేటర్లు, టెలిఫోన్లు, టీవీ సెట్లు ఉన్నాయి. కారులో ఒకేసారి 75 మంది కూర్చోవచ్చు. కారు తయారైన కొత్తలో దీన్ని చాలా సినిమాల్లో చూపించారు. చాలా మంది అద్దెకు కూడా తీసుకొన్నారు. అయినప్పటికీ నిర్వహణ ఖర్చు, పార్కింగ్ సమస్య కారణంగా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. కారు తయారీకి రెండున్నర లక్షల డాల్లర్లు ఖర్చయింది. మూడేళ్ల కాలం పట్టింది. అయితే కొనేవారు లేకపోవడంతో ప్రస్తుతం ఈ కారు డెజర్లాండ్ పార్క్ కార్ మ్యూజియానికే పరిమితమయ్యింది.
Discussion about this post