ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, ఖమ్మంజిల్లా పాలేరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల పాలేరు నుంచే పోటీ చేస్తున్నారు. అంతకుముందు వైఎస్ విజయమ్మ పోటీ చేయవచ్చంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో పాలేరు ఒకటి.. పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోట. వైఎస్ అభిమానులు, ఇతర సామాజిక వర్గాల ఓటు బ్యాంకు..కాంగ్రెస్ కు బలం. 2018 ఎన్నికల్లో సీనియర్ నేత, బలమైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇంత బలమైన సీటు కాబట్టే కాంగ్రెస్ ముఖ్య నేతలు కన్నేశారు..
ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కాంగ్రెస్ లో చేరారు.ఆ ఇద్దరు నేతలు పాలేరు సీటు కావాలని అడిగినప్పటికీ పొంగులేటి వైపు ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో వారికి ఫాలోయింగ్ ఎక్కువే. జిల్లాను ప్రభావితం చేయగలిగే ఇద్దరు బలమైన నేతలు ఒక్కటయ్యారు. తమను దూరం చేసుకున్న బీఆర్ఎస్ను ఓడించి దెబ్బ కొట్టాలని.. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు..పాలేరులో ఇద్దరిలో .. ఎవరు పోటీ చేసినా గట్టి పోటీ తప్పదు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ది లోకల్. పాలేరు నియోజక వర్గమే. షర్మిల, పొంగులేటి.. వీరంతా నియోజక వర్గానికి నాన్ లోకల్. ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.. ఈ అంశమే అధికార పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఏ ఆపద వచ్చినా..ప్రజల్ని ఆదుకోవడం, ఏ కారణంతో అయినా మరణిస్తే.. ఆ కుటుంబానికి తన ట్రస్టు తరపున పదివేలు ఆర్థిక సహాయం విస్తృతంగా చేశారు ఎమ్మెల్యే కందాల. అంతే కాకుండా.. నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో ఆలయాలు, చర్చిలు, బొడ్రాయి నిర్మాణాలు, ప్రతిష్ట,ఉత్సవాలకు లక్షల్లో విరాళాలు ఇచ్చారు. సమస్య ఏదయినా.. తనను కలిసిన ప్రతి ఒక్కరికీ.. వెంటనే స్పందిస్తారనే పేరుంది ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి. ఈ ఐదేళ్ళల్లో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాల వివరాలతో.. ఇంటింటికి కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. టికెట్స్ ప్రకటన తర్వాత ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతల్ని తమవైపు తిప్పుకునేందుకు వ్యూహం రచిస్తున్నారు. మొదటి నుంచి పాలేరు సీటు తనదేనని.. ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.
తెలంగాణ లో 3,600 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల.. ఆ తర్వాత కాంగ్రెస్లో పార్టీ విలీనంపై చర్చలు జరిపారు .. దానిపై స్పష్టత రాక పోవడంతో..ఆమె తన పార్టీ నుంచే పాలేరులో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. పాలేరు బిడ్డను..ఇక్కడ నుంచే పోటీ చేస్తానని అంటున్నారు షర్మిల .. అంతేకాదు నామినేషన్ వేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. నవంబర్ 4న షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 1 నుంచి నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. పొంగులేటి .. షర్మిల సన్నిహితులే ..అయితే ఇపుడు ప్రత్యర్థులుగా మారారు.
పాలేరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ప్రభావం చూపుతారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండటంతో గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం ఎస్టీ ఓటర్లు. నియోజకవర్గంలో డామినేషన్ మాత్రం ఓసీ వర్గాల వారిది. నియోజకవర్గంలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరుగగా 10 సార్లు కాంగ్రెస్,నాలుగు సార్లు ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి BRS లో చేరారు.ప్రస్తుత పాలేరు ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రం లోనే హాట్ సీట్ గా మారిన పాలేరులో ఎవరు గెలుస్తారు ? ఏ జెండా ఎగురుతుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్ట బోతున్నారన్నదీ వేచిచూడాలి.
Discussion about this post