ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల హలాల్ ధృవీకృత ఉత్పత్తులను తక్షణం నిషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతో ఇకపై ఉత్తర్ ప్రదేశ్ లో హలాల్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో హలాల్ ఉత్పత్తుల పేరుతో మోసాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హలాల్ ట్యాగ్‌తో కూడిన ఉత్పత్తులను పూర్తిగా నిషేధించింది. ప్రజారోగ్యం దృష్ట్యా హలాల్ ధృవీకృత తినదగిన వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలు తక్షణమే ఉత్తరప్రదేశ్‌లో నిషేధించినట్లు ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విక్రయించే రిటైల్ ఉత్పత్తులకు చట్టవిరుద్ధమైన హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు లక్నో పోలీసులు పలు సంస్థలపై కేసులు నమోదు చేశారు.
సరైన అధికారం లేకుండా ఆహారం, సౌందర్య ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసే అక్రమ సంప్రదాయాన్ని అరికట్టడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారని ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. హలాల్ ఉత్పత్తులు ప్రధానంగా మాంసాహార ఉత్పత్తులు కావడం, వీటిని ఉత్పత్తి చేసేవారు, అమ్మేవారు ముస్లిం వర్గాలకు చెందిన వారు కావడంతో ఎన్నికల ముందు యోగీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Discussion about this post