కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. తెలంగాణ రాజకీయాల్లో పేరున్న నాయకుడు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది. ఈ సాన్నిహిత్యం వల్లనే ఆయన కాంగ్రెస్ హయాంలో 2009-11 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా, 2011-14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్ వంటి కీలక పదవుల్లో కొనసాగారు.
వైఎస్సార్‌ని రాజకీయ గురువుగా భావించే భట్టి విక్రమార్క.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. లింగాల కమల రాజు బీఆర్ఎస్ టిక్కెట్ పై పోటీచేస్తున్నారు. ఈ లింగాల కమల రాజు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 3,567… ఓట్ల మెజారిటీ భట్టి గెలిచారు. అంతకు ముందు 2014..2009..ఎన్నికల్లోకూడా కమలరాజు గట్టి పోటీ ఇచ్చారు. ఈ సారి కూడా వీరిద్దరి మధ్యనే గట్టి పోటీ జరగవచ్చు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.. 2007-09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో చీఫ్ విప్‌గా, 2011 జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై సేవలు అందించారు. ఇక 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
సీనియర్ నేత బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా కూడా భట్టి విక్రమార్క ఎన్నికైనారు. కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా వ్యవహరిస్తోన్న భట్టి విక్రమార్క.. పార్టీలో బలమైన దళిత నేత. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకుల్లో భట్టి విక్రమార్క కూడా ఒకరు.
2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్ మార్చ్’ పేరిట పాదయాత్ర ప్రారంభించి.. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలోమీటర్ల మేరకు నడిచారు. అడుగడుగునా ప్రజల సమస్యల గురించి భట్టి తెలుసుకున్నారు. అలాగే తన పాదయాత్ర ముగింపులో భాగంగా 2023 జులై 2న ఖమ్మం లో జనగర్జన సభను నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Discussion about this post