ఐసీసీ టీ – 20 వరల్డ్‌కప్ 2026లో పాకిస్తాన్‌పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహాశివరాత్రి రోజు పాకిస్తాన్‌పై భారత్ గెలిస్తే ఆ టోర్నీలో టీమిండియాకు ఇబ్బందులు తప్పవు అన్న ప్రశ్న ఇప్పుడు అందర్నీ కలచివేస్తోంది.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో 2003, 2015లో ఫిబ్రవరి 15నే భారత జట్టు రెండు సార్లు పాక్‌తో తలపడింది. ఈ రెండు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించినా.. ఫైనల్, సెమీస్‌లో ఆసీస్‌పై ఓడిపోయింది.

మహాశివరాత్రి రోజు పాకిస్తాన్ జట్టును టీమిండియా జాగారం చేసేలా చేసింది. అలా ఇలా కాదు ఇంకో టీ20 వరల్డ్ కప్ వరకూ గుర్తుండిపోయేలా పాక్‌ను భారత్ ఓడించింది. రణరంగం.. మినీ యుద్ధంలా సాగుతుంది అనుకున్న కొలంబో మ్యాచ్ చప్పగా సాగింది. భారత్ వన్ సైడ్‌గా గెలిచి ఐసీసీ వేదికలపై తామే నెంబర్ వన్ అని మరోసారి చాటిచెప్పింది. అంతా బాగుంది కానీ.. ఈ శివరాత్రి రోజు పాకిస్తాన్‌పై గెలిచిన ప్రతిసారీ టీమిండియాకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కొంపదీసి ఈ ఏడాది కూడా అలానే జరుగుతుందా? అని కొందరు ఫ్యాన్స్ భయపడుతున్నారు.
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా కొలంబో ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ – పాక్ మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 175 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 77 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ సూర్య వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను కేవలం 114 పరుగులకే భారత్ ఆలౌట్ చేసి 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే, గతంలో జరిగిన రెండు టోర్నీల్లో ముఖ్యంగా 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్ వరకూ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలయింది. అదేవిధంగా 2015 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ పరాజయం పాలయింది. ఈ రెండు టోర్నమెంట్‌లలో ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచింది.
మరి ఇప్పుడు అదే ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ ఏడాది కూడా కీలక మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌ను ఓడించనుందా? అంటూ ఒక అనుమానం పుట్టుకొచ్చింది. ఒకవేళ అదే జరిగితే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ కావడం ఖాయం. కానీ నిజంగా ఈ సారి పాత సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేదా? అన్నది మాత్రం అనుమానమే!
ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా పరిస్థితి దారుణంగా తయారయింది. జింబాబ్వే మీద 23 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా సూపర్-8కు అర్హత సాధిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. శ్రీలంకతో జరిగే కీలక పోరులో ఆసీస్ ఓడిపోతే ఇంటిబాట పట్టడం దాదాపు ఖాయమే. శ్రీలంక, జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక-ఆసీస్ మ్యాచ్‌లో లంక విజయం సాధిస్తే అది సూపర్ 8కి, ఆసీస్ ఇంటిబాట పట్టడం ఖాయమనే చెప్పొచ్చు.
Follow for more updates
