ముంబై మహానగరంలో 15 ఏళ్ల కిందట నవంబరు 26 న పాకిస్థాన్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ భయంకర దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. అయితే మనదేశానికి చెందిన వీర జవాన్లు, పోలీసులు ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. ఆ అమరవీరుల ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకుందాం.
ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కమ్లాకర్ కర్కరే రాత్రి డిన్నర్ చేస్తుండగా ఉగ్రవాద దాడికి సంబంధించి సమాచారం వచ్చింది. వెంటనే ఆయన ఏసీపీ అశోక్ కామ్టే, ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌తో కలిసి రంగంలోకి దిగారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన కసబ్ తదితర ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో హేమంత్ వీరమరణం పొందారు. మరణానంతరం ఆయనకు భారత ప్రభుత్వం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
పాక్ ముష్కరుల దాడి జరిగిన సమయంలో రంగంలోకి దిగిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో ఏసీపీ అశోక్ కామ్టే కూడా ఉన్నారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది ఇస్మాయిల్ ఖాన్ జరిపిన కాల్పుల్లో అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ వెరవకుండా కొందరు శత్రువులను తుదముట్టించారు. అనంతరం కన్నుమూశారు. మరణానంతరం ఆయనకు అశోకచక్ర పురస్కారం లభించింది.
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్ పేరు వినగానే ముంబయి అండర్‌వరల్డ్ వణికిపోయేది. పాక్ టెర్రరిస్టుల దాడి జరిగినప్పుడు విజయ్ సలాస్కర్ కూడా ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలోనే ఉన్నారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల బుల్లెట్లకు సలార్కర్ వీరమరణం పొందారు. మరణానంతరం ఆయనకు కూడా అశోకచక్ర పురస్కారం లభించింది.
ముంబై పోలీస్ విభాగానికి చెందిన ఏఎస్ఐ తుకారాం ఓంబ్లే ఆయుధాలు లేకుండా ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఎదుర్కోవడమే కాకుండా, చివరికి అతన్ని పట్టుకోవడంలో కూడా విజయం సాధించారు. ఈ సమయంలో కసబ్ అతనిపై కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా తుకారాం అమరుడయ్యారు. మరణానంతరం ఆయనకు అశోకచక్ర పురస్కారం లభించింది.
ఉగ్రవాద దాడులు జరిగినపుడు చేపట్టిన మిషన్ ఆపరేషన్ బ్లాక్ టోర్నాడోకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నాయకత్వం వహించారు. ఆయన 51 ఎన్ఎస్ఏజీ కమాండర్. తాజ్ మహల్ ప్యాలెస్, టవర్స్ హోటల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో మేజర్ పోరాడుతుండగా, ఒక ఉగ్రవాది వెనుక నుండి దాడి చేశాడు. దీంతో ఆయన అక్కడికక్కడే వీరమరణం పొందారు. అతనికి మరణానంతరం భారత ప్రభుత్వం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. వీరితోపాటు హవల్దార్ గజేంద్ర సింగ్, నాగప్ప ఆర్. మహాలే, కిషోర్ కె. షిండే, సంజయ్ గోవిల్కర్, సునీల్ కుమార్ యాదవ్ తదితరులు వీరోచితంగా పోరాడారు.
Discussion about this post