తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, మేనిఫెస్టో విడుదలలో తొలుత వెనుకపడిన బీజేపీ క్రమేణా పరిస్థితులను చక్కదిద్దుతోంది. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రచారంలో బీజేపీ నేతలు వేగం పెంచారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 16న అధిష్టానం విడుదల చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మేనిఫెస్టోలో ఏయే అంశాలు, హామీలు ఉండబోతున్నాయనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇదివరకే చెప్పారు. ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని పార్టీ చెబుతోంది. జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలపై మేనిఫెస్టోలో కచ్చితమైన హామీలు ఉండవచ్చని చెబుతున్నారు. తెలంగాణలోని పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చినట్టు తెలుస్తోంది.
అధికార బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను అందరికంటే ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరు ప్రధాన హామీలతో ముందుకొచ్చింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిదు ప్రధాన హామీలతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటించి యువజన ఓటర్ల మద్దతు కూడగట్టుకోవటానికి గట్టిగా యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేయడంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు డేట్ పై క్లారిటీ రావడంతో ఏయే హామీలు ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 23వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం బీజేపీ జాతీయ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తెలంగాణలో దిగుతారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25, 26, 27 తేదీల్లో మరో విడత ప్రచారానికి రానున్నారని అంటున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
























Discussion about this post