మరోసారి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేపబోతున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు.తమదైన ప్రచార శైలిలో వారిద్దరు దూసుకుపోతున్నారు. తాజాగా ఇల్లినాయీస్, ఒహైయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఖరారు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్‌తో పోటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్… చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు యూఎస్ చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందని, బైడెన్ విధానాలను విమర్శిస్తూ ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ మాటలు మాట్లాడారు.
మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని… తీవ్రంగా విమర్శిస్తున్నారు ట్రంప్. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని తెలిపారు. 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకొని ఈ మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈసారి తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని అన్నారు.
ట్రంప్ చేసిన మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో.. ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్ లీవిట్ వివరణ ఇచ్చారు. బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఆయన అలా మాట్లాడినట్టుగా వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్ సానుభూతి ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటనలో అరెస్టయిన వారిని… ఆయన బందీలుగా, దేశభక్తులుగా అభివర్ణించడం గమనార్హం.
Discussion about this post