ఏ దేశానికి సాధ్యం కాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3తో భారత్ విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఈ మిషన్ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఇస్రో సైంటిస్టుల కృషి ఫలితంగా ప్రతికూల వాతావరణం ఉండే చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. రెండు వారాల పాటు పరిశోధనలు చేసిన ల్యాండర్, రోవర్లు ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. చంద్రయాన్-3 మిషన్ దాదాపు ముగిసినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్-3 అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని.. అంచనాలకు మించి పనిచేసింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో సిద్ధమైంది.
చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు సమాచారం. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి చేపడుతోన్న తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా ల్యూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ (LUPEX) అనే పేరును సూచించే అవకాశాలు ఉన్నాయి. జపాన్‌కు చెందిన హెచ్ 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నట్టు తెలిసింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ మిషన్‌కు సంబంధించి ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) 2017లో ఒప్పందంపై సంతకం కూడా చేశాయి. చంద్రయాన్-3 తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించాయి. చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై నీటి ఉనికిని కనుగొనడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ ఆవిష్కరణ భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు మద్దతుగా నిలవడమే కాదు.. ఇది చంద్రుడి రహస్యాలను విప్పుతుంది.
నివేదికల ప్రకారం.. ISRO, JAXA చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి ల్యాండర్, రోవర్‌ను పంపాలని యోచిస్తున్నాయి. అవి జాబిల్లి ఉపరితలంపై అధ్యయనాలు నిర్వహిస్తాయి. చంద్రయాన్-3 మాదిరిగా చంద్రయాన్-4 మిషన్ చంద్రుని దక్షిణ-ధ్రువంపై పరిశోధనలు చేయనుంది. ఈ మిషన్ 2026లో ప్రయోగించే అవకాశం ఉంది.
Discussion about this post