మామిడి తోటలు ఉన్నవాళ్లు పండ్లని మార్కెట్‌కి తీసుకొచ్చి అమ్ముతుంటారు. మరికొందరు విదేశాలకు ఎగుమతి కూడా చేస్తుంటారు. అవేమీ చేయకుండానే గుజరాత్‌లోని గిర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం లక్షల్లో ఆదాయం పొందుతోంది.
నూర్ అలీ వీర్ ఝారియా తనకున్న పదిహేను ఎకరాల్లో మామిడి తోట వేశాడు. తోటంతా ఒకే రకం కాకుండా దాదాపు 300 రకాల మామిడి జాతులను నాటాడు. బంగినపల్లి, తోతాపురి, అల్ఫోన్సో, కొంకణ్, దశేరి తదితర దేశీయ రకాలతోపాటు అమెరికా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యూరప్‌లో పండే మామిడి జాతులను పెంచాడు. ఆ వైవిధ్యాన్ని అందరికీ చూపాలనుకున్న ఝారియా కుటుంబం.. వేసవిలో కాపు మొదలైనప్పట్నుంచీ ఆసక్తి ఉన్న వారిని తమ తోటకు ఆహ్వానిస్తోంది. మామిడి పండ్లను ప్రదర్శనకు ఉంచి, వచ్చిన వారికి వాటిని రుచి చూపించడం, ఆయా జాతుల గురించి వివరించడం చేస్తున్నారు. రకరకాల ఫెస్ట్లూ నిర్వహిస్తున్నారు. వాటికి ఎంట్రన్స్ టిక్కెట్లు, అడిగిన వారికి పండ్లను అమ్మడం ద్వారా ఝారియా కుటుంబం మామిడి సీజన్లో దాదాపు యాభైలక్షల రూపాయల ఆదాయం పొందుతోంది. సీజన్ చివర్లో మాత్రం మిగిలిన కాయల్ని ఊరంతా పంచి మామిడి పండగనూ జరుపుతోంది.
Discussion about this post