దేశంలో అత్యయిక పరిస్థితి విధించి నేటి కి 49 ఏళ్లు పూర్తికానుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలమది. ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 1975 జూన్ 25న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇందిరాగాంధీ ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ సోమవారం కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.ఇందిరా గాంధీ అసలు ఎమర్జెన్సీ ని ఎందుకు విధించారు ?అన్ని విమర్శలు రావడానికి కారణం ఏంటి ? ఈ వివరాలు మనం ఈ స్టోరీ లో తెలుసుకుందాం ..
”సోదర, సోదరీమణులారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు” అని 1975 జూన్ 25న ఇందిరా గాంధీ రేడియోలో ప్రకటించారు. ఆ ప్రకటనతో దేశమంతటా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. 1977 మార్చి 21 వరకూ ఎమర్జెన్సీ కొనసాగింది. ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి.రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
1966 జనవరి 24న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీకి 1971 లోక్‌సభ ఎన్నికల వరకూ దేశంపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై గట్టి పట్టుంది.1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజ్‌నారాయణ్‌పై లక్షా 11 వేల 810 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు.1971 సాధారణ ఎన్నికల్లో గరబీ హఠావో నినాదంతో 352 పార్లమెంటు స్థానాలను ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మరోవైపు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. తిరుగులేని మెజార్టీతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను రాజ్‌నారాయణ్ ప్రతిష్టాత్మకంగా మార్చారు. ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులూ ఒడ్డారు. అయితే, ఎన్నికలఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి . . అయినా రాజ్‌నారాయణ్ పట్టువీడలేదు. ఇందిరా గాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు.ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరా గాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజ్‌నారాయణ్ ఆరోపించారు.అయన కోర్ట్ లో దీనిని సవాలు చేయడం అలహాబాద్ కోర్ట్ దానిని అడ్మిట్ చేయడం అనూహ్యంగా జరిగింది .
ఈ కేసులో 1975 మార్చి 18న ఇందిరా గాంధీ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరుకావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి. ప్రతిపక్ష పార్టీలు ఇందిరా గాంధీపై నిప్పులు చెరిగాయి. జూన్ 25న దిల్లీలోని రాంలీలా మైదానంలో జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది.జయప్రకాశ్ నారాయణ్ సభ తర్వాత, రేడియోలో ఇందిరా గాంధీ సోదర, సోదరీమణులారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భయాందోళన అవసరం లేదు.”అని ఎమర్జెన్సీ ని ప్రకటించారు .అంతర్గత అలజడి పేరుతో ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదస్పదమైన నిర్ణయాల్లో ఈ అత్యవసర పరిస్థితి ఒకటి. ఇందిర సిఫార్సుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 (1)లోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకుని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు.అత్యయిక స్థితి విధించిన వెంటనే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం, ఎన్నికల వాయిదా, ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడం, పత్రికలపై నియంత్రించడం లాంటి చర్యలను చేపట్టారు. ఇది 1977 మార్చి 21 వరకు 21 నెలలపాటు కొనసాగింది.
Discussion about this post