బెంగుళూర్ ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. రోజూ నీళ్ల కోసం ఒక రకంగా చెప్పాలంటే చిన్న పాటి యుద్దాన్నే చేస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూర్లో 50 కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తెలిపారు. పౌరసంఘాలు, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ నీటి వనరులు ఆక్రమణలకు గురయ్యాయన్నారు.
బెంగళూరుకు 2,600 ఎంఎల్డి నీరు అవసరం ఉందని, ఇందులో 1,470 ఎంఎల్డి కావేరి నది నుండి, 650 ఎంఎల్డి బోర్వెల్ల నుండి వస్తుందని అన్నారు. దాదాపు 500 ఎంఎల్డి కొరత ఉందని కర్ణాటక సీఎం తెలిపారు. బెంగుళూరులో 14 వేల బోర్వెల్లు ఉండగా.. అందులో 6 వేల 900 బోర్లు ఎండిపోయాయని సిద్దరామయ్య తెలిపారు. నీటి కోరత తీరాలంటే బెంగుళూరు నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరమన్నారు. ప్రతిరోజూ సమావేశమై నీటిని పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం 313 ప్రాంతాల్లో అదనపు బోర్వెల్లు వేయాలని యోచిస్తోందని సీఎం వెల్లడించారు. మురికివాడలు, బోర్వెల్లపై ఆధారపడిన ప్రాంతాలు, గ్రామాలకు నీటిని అందించేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో సహా అన్ని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఉపయోగించాలని అధికారులను ఆదేశించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి నిధుల కొరత లేదని, భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభం రాకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా బెంగుళూరులో 60 శాతం మంది ట్యాంకర్ నీటిపైనే ఆధారపడుతున్నారు.
Discussion about this post