భారీ దొంగతనం..12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లు మాయం…!

Professional News Post | KitKat Heist
అంతర్జాతీయ వార్తలు

కిట్‌క్యాట్ చాక్లెట్ల భారీ దొంగతనం: ఐరోపాలో 12 టన్నుల సరుకుతో మాయమైన ట్రక్కు!

రిపోర్టర్: రాజేష్ (Rajesh) తేదీ: 2026

మనం ఎప్పుడైనా బంగారం, డబ్బులు దొంగతనం చేయడం చూసి ఉంటాం.. ఆఖరికి చాక్లెట్ల దొంగలను కూడా చూసి ఉంటాం.. అది కూడా ఒకటి రెండు ఎత్తుకెళ్లి తిని ఉంటారు.. కానీ, యూరప్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ ప్రియులకు ఇష్టమైన కిట్‌క్యాట్ చాక్లెట్లతో నిండిన ఒక భారీ ట్రక్కు దొంగిలించడం సంచలనం రేపుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార దిగ్గజం Nestlé తయారు చేసే KitKat చాక్లెట్లతో నిండిన ట్రక్కు ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

KitKat Bar
ఆ ట్రక్కులో సుమారు 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లు ఉన్నాయని.. వాటిలో కొత్త శ్రేణికి చెందిన సుమారు 4లక్షల 13వేల 793 చాక్లెట్ బార్‌లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇంత పెద్ద మొత్తంలో చాక్లెట్ల దొంగతనం జరగడం సప్లై చైన్‌ భద్రతపై సందేహాలు కలిగిస్తోంది. రవాణా సమయంలోనే ట్రక్కు అదృశ్యమవ్వడం గమనార్హం. ఇప్పటివరకు ట్రక్కు గానీ, అందులోని చాక్లెట్ సరుకు గానీ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ ఘటనపై స్పందించిన Nestlé సంస్థ, “తాము స్థానిక అధికారులతో పాటు తమ సరఫరా భాగస్వాములతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఈ సంఘటన వినియోగదారుల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపదని, మార్కెట్‌లో సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Chocolate Shipment

దొంగలను పట్టుకోవడానికి కంపెనీ ఒక కీలక సమాచారాన్ని వెల్లడించింది. ప్రతి చాక్లెట్ బ్యాచ్‌పై ప్రత్యేకమైన కోడ్ ఉంటుందన్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ ఉత్పత్తి ఎక్కడికి వెళ్లిందో గుర్తించే అవకాశం ఉంటుందని.. దీని ద్వారా దొంగిలించబడిన సరుకును ట్రాక్ చేయడం సులభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఘటనపై కిట్‌క్యాట్ సంస్థ కొద్దిగా సరదాగా స్పందించింది. “దొంగల అభిరుచి అద్భుతంగా ఉంది, కానీ దొంగతనం అన్ని వ్యాపారాలకు పెద్ద సమస్యగానే ఉంటుంది” అని వ్యాఖ్యానించింది. అయితే, ఇంత పెద్ద ట్రక్కు ఎక్కడికి మాయమైందన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇంకా వెల్లడలేదు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top