కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు.
ఈనెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందని డీజీపీని సీఎం నిలదీశారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు సమాధానంగా డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నిమిత్తం భద్రతా ఏర్పాట్లలో పోలీసు సిబ్బంది అంతా బిజీగా ఉండటం వల్లే విచారణలో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను, ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ అందజేశారు.

ఈ కేసును వేగవంతంగా, లోతుగా విచారించడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విచారణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని సూచించారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, సాక్ష్యాధారాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం నేరుగా రంగంలోకి దిగడంతో, బండి భగీరథ్ కేసు విచారణ ఇప్పుడు వేగం పుంజుకోనుంది. రానున్న 24 గంటల్లో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బాధితులు, సాక్షుల నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతమైంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించడంతో, ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ఈ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విచారణ అంతా ఓ మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో జరగనుంది. బాధితురాలి ప్రయోజనాలను కాపాడటంతో పాటు కేసులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు.
Follow for more updates
