ఆరున్నర దశాబ్దాల పోరాట ఫలితం..12 వందల మంది అమరుల ప్రాణ త్యాగం.. వెరసీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.

.. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి మధ్య ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ ఘట్టాలను మరోసారి గుర్తుచేసుకునే సందర్భం ఇది.
జూన్ 2.. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన చారిత్రక రోజు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిన గొప్ప ఘట్టం. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన నిరంతర పోరాటం, వేలాది అమరవీరుల త్యాగాల ఫలితం రాష్ట్రం తెలంగాణ. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినా, హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరుకున్నాడు. అయితే తన పాలన విధానాలతో ప్రజలను తీవ్రంగా హింసించాడు. ముఖ్యంగా తన సైన్యమైన రజాకార్లతో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టాడు.
నిజాం ఆగడాలు తట్టుకోలేక తెలంగాణ రైతు, సాయుధ పోరాటం పురుడు పోసుకుంది. ఈక్రమంలోనే భారత ప్రభుత్వం సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో 1948 సెప్టెంబరు 13న ఆపరేషన్ పోలో ప్రారంభించింది. ఐదు రోజుల్లోనే నిజాం సైన్యం ఓడిపోయి, సెప్టెంబరు 17న నిజాం భారత యూనియన్‌లో చేరేందుకు ఒప్పుకున్నాడు. ఇది తెలంగాణ ప్రజలకు నైజాం అణచివేత నుంచి విముక్తి అందించింది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో భాగమైంది.
1956లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తెలంగాణ ప్రజల అభ్యంతరాలను పక్కన పెట్టి ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తెలంగాణ ప్రజల హక్కులు, భవిష్యత్తు రక్షణ కోసం ‘పెద్దమనుషుల ఒప్పందం’ అనే ఒక ఒప్పందం కుదిరింది. కానీ కాలం గడిచేకొద్దీ ఆ ఒప్పందం నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయి. నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందనే భావన ప్రజల మనసుల్లో బలంగా నాటుకుంది.ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా మొదటిసారి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు గళం విప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వారు ఉద్యమాన్ని మొదలు పెట్టారు.
ఆ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో సుమారు 370 మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆ సమయపు రాజకీయ పరిస్థితుల కారణంగా ఉద్యమం పూర్తి రాష్ట్ర సాధన వరకు చేరుకోలేకపోయింది. ఆ తర్వాత అనేక సంఘాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశాయి. రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అనేక మంది కవులు, కళాకారులు స్వరాష్ట్రం కోసం నినదించారు. కానీ రాజకీయ కారణాలతో ఉద్యమం పలుచగానే సాగింది.
2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించడంతో ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. ఆ తర్వాత కూడా రాజకీయ కారణాలతో స్తబ్దుగానే సాగింది. 2009 నవంబర్‌లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని ఉరుములా మార్చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించింది.
కానీ కొన్ని రోజులకే రాజకీయ సంప్రదింపుల అనంతరం విభజనపై ముందుకు సాగుతామని మరో విరుద్ధ ప్రకటన చేసింది. దీంతో మళ్లీ ఉద్యమం రగిలింది. విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు, కవులు, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై రోడ్లపైకి వచ్చారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, వంటా-వార్పు కార్యక్రమాలు వంటి భారీ ఉద్యమాలతో మొత్తం తెలంగాణ ప్రాంతం స్తంభించిపోయింది.
Follow for more updates
