రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో.. వెలుగులోకి నమ్మలేని నిజాలు !| Kakinda Girl Missing Case

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. చిన్నారితో పాటు మాయమైన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే, చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తుని మండలం సి.హెచ్. అగ్రహారానికి చెందిన వ్యవసాయ కూలీలు గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యమైంది. అప్పటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు. కాగా, మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జీడితోటల వద్దకు తిరిగి వచ్చిన పెంపుడు కుక్క, ఆందోళనగా ప్రవర్తించింది. తల్లి భవాని చున్నీ పట్టుకుని లాగి, మళ్లీ సమీపంలోని గుట్టల వైపు పరుగెత్తింది. ఈ పరిణామంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్‌తో కలిసి కుక్క వెళ్లిన దారిలో రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది.

డీఎస్పీ తిలక్ నేతృత్వంలో వందలాది మంది పోలీసులు, సీఐలు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని జీడితోటలు, కొండ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో జల్లెడ పడుతున్నారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని ఇనుప కంచె వద్ద లభించిన చిన్నారి, కుక్క వెంట్రుకల నమూనాలను పోలీసులు సేకరించి పరీక్షలకు పంపారు. మరోవైపు, జ్ఞానేశ్వరి తన చెల్లి ఉయ్యాల ఊపుతూ ‘అమ్మా పాలు పట్టు’ అని ముద్దుగా మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. చిన్నారి ప్రమాదవశాత్తు కొండల్లోకి వెళ్లిందా లేక ఎవరైనా అపహరించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

  • తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం
  • శనివారం నుంచి కనిపించకుండా పోయిన బాలిక
  • తిరిగి వచ్చిన పెంపుడు కుక్క.. చిన్నారి తల్లిని లాగి అడవిలోకి పరుగు
  • వందలాది మంది పోలీసులతో 500 ఎకరాల్లో ముమ్మర గాలింపు
  • వైరల్ అవుతున్న చిన్నారి వీడియోలు.. ఆచూకీ కోసం ఆందోళన

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top