విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వెంటాడుతున్న ఆ శాపం ఏంటి ? | The Curse on the Vizag Steel Plant

విశాఖ నగర గుండె చప్పుడుగా, లక్షలాది కుటుంబాల జీవన జ్యోతిగా వెలుగుతున్న ‘విశాఖ స్టీల్‌ప్లాంట్’..నిరంతరం మండుతూ ఉండే ఆ కొలిమిల వెనుక ఎందరో కార్మికుల రక్తం, చెమట ఉన్నాయి.

దేశానికి ఉక్కును అందించే ఆ కర్మాగారం, ఎన్నో ఇళ్లల్లో శాశ్వత చీకట్లను మిగిల్చింది. ఫర్నేస్‌ల వేడి, ద్రవరూప ఉక్కు.. అనేకసార్లు కార్మికుల పాలిట కాలయముడిగా మారాయి. నిన్నటి దాకా మనతో కలిసి నడిచిన తోటి ప్రాణాలు కళ్ల ముందే బూడిదైపోతుంటే, ఆ కర్మాగారపు గోడలు మూగగా రోదించాయి. అలా ప్లాంట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఘటనలేంటో ఓ సారి చూద్దాం.

విశాఖ స్టీల్‌ప్లాంట్.. వేలాది కుటుంబాలకు బతుకునిచ్చే ఉక్కు కోట. కానీ, ఇనుమును కరిగించే ఆ వేడి కొలిమిలు, ఎందరో కార్మికుల ప్రాణాలను కూడా బూడిద చేసేశాయి. లాభాల కోసం యంత్రాలు పరిగెడుతుంటే, కార్మికుల ఇళ్లల్లో మాత్రం కన్నీళ్లు మిగులుతున్నాయి. కన్నీటి గాథలకే విశాఖ స్టీల్‌ప్లాంట్… కేరాఫ్ గా మారుతోంది. 2011 ఏప్రిల్ నెల ప్లాంట్‌కు శనిలా దాపురించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వేల డిగ్రీల వేడితో మరుగుతున్న 140 టన్నుల ద్రవపు ఉక్కు లీకై, కిందపడి వరుసగా రెండు భారీ ప్రమాదాలు జరిగాయి. ఆ వెంటనే రా మెటీరియల్ ప్లాంట్‌లో కన్వేయర్ బెల్టులు కాలిపోయాయి. రోజుల తరబడి ఉత్పత్తి ఆగిపోవడమే కాదు, ప్లాంట్‌కు ఏకంగా 120 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఆర్థికంగా కోలుకోకముందే, కార్మికుల ప్రాణాలను బలితీసుకునే రాకాసి మంటలు మొదలయ్యాయి.

2012 మే 1వ తేదీన కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్‌-3 లో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఆ గాయం పచ్చిగా ఉండగానే.. సరిగ్గా నెల తిరగకుండానే 2012 జూన్ 13న స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే మరో చీకటి రోజు ఎదురైంది. ఆక్సిజన్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ చేస్తుండగా అధిక పీడనంతో ఊహించని విధంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఆ మంటల తీవ్రతకు డీజీఎం స్థాయి అధికారులతో సహా మొత్తం 19 మంది కార్మికులు కళ్లముందే బూడిదైపోయారు. వారి ఆర్తనాదాలు ఆ ఫ్యాక్టరీ గోడల మధ్యే కలిసిపోయాయి.

ఈ విషాదం నుంచి తేరుకోకముందే.. 2014 జూన్ 16న ల్యాబ్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన ఇద్దరు ప్రైవేట్ ఇంజనీర్లను ‘కార్బన్ మోనాక్సైడ్’ విషవాయువు రూపంలో మృత్యువు కబళించింది. ఊపిరాడక వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత 2020 డిసెంబర్‌లో ద్రవపు ఉక్కు తీసుకెళ్లే ల్యాడిల్ హుక్స్ ఊడిపోయి నలుగురు కార్మికులు తీవ్రంగా కాలిపోయి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కాలం కరుణించలేదు.. 2021 నవంబర్ 16న ఫర్నేస్‌లో వ్యర్థాలను క్లీన్ చేస్తుండగా, వేడి ద్రవరూప లోహం ఉప్పెనలా ఎగసిపడి ఎర్త్‌ మూవర్ పైకి దూసుకొచ్చింది. ఆ వేడిని తట్టుకోలేక ఆపరేటర్, సూపర్‌వైజర్ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టెక్నాలజీ మారుతున్నా కార్మికుల తలరాతలు మారలేదు. 2025 ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య వివిధ ప్రమాదాల్లో మరో ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోగా, 2026 మే 11న థర్మల్ పవర్ ప్లాంట్‌లో మళ్లీ గ్యాస్ లీకై నలుగురు కార్మికులు అపస్మారక స్థితికి వెళ్లారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వారు ప్రాణాలతో బయటపడగలిగారు..

మెల్టింగ్ షాపుల్లో యంత్రాలు అరిగిపోతున్నాయి, వ్యవస్థలు ముసలివైపోతున్నాయి. అయినా యాజమాన్యం ఆధునికీకరించడం లేదు అనేది కార్మిక సంఘాల ఆరోపణ. ఇనుమును కరిగించే ఆ ఫ్యాక్టరీలో కార్మికుల కన్నీళ్లు కూడా కరిగిపోతున్నాయి. లాభాలు, నష్టాల లెక్కల కంటే.. ఉదయం డ్యూటీకి వెళ్లిన భర్త, కొడుకు, తండ్రి రాత్రికి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలన్నదే ఆ కార్మిక కుటుంబాల ప్రతి రోజు ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నారు. ఇకనైన ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top