హైదరాబాద్ నగరంలో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి 9 గంటలకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులకు భారీ వర్షం తోడైంది. గాలివాన దెబ్బకు పలు హోటళ్లు, కార్యాలయాల బోర్డులు ఎగిరిపడ్డాయి.

అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. గాలుల తీవ్రత కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడింది. దీంతో పలు విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బ తినడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. ఖైరతాబాద్, సోమాజిగూడ, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, నిజాంపేట్, బషీర్‌బాగ్, కొండాపూర్, రాజేంద్రనగర్, గోల్కొండ, శివరాంపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షం కారణంగా ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అత్తాపూర్‌లో PVNR ఎక్స్‌ప్రెస్ వే కింద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మైత్రివనం కూడలి వద్ద, పంజాగుట్టలో మెయిన్ రోడ్‌పై మోకాల్లోతున వరద నీరు ప్రవహించింది.
చార్మినార్ యునాని హాస్పిటల్ వద్ద ఉన్న 150 సంవత్సరాల భారీ వృక్షం రాత్రి గాలివానకు కుప్పకూలింది. పక్కనే పార్క్ చేసి ఉన్న 10 ద్విచక్ర వాహనాలపై చెట్టు పడటంతో అవి ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అనంతరం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు, చార్మినార్, మొఘల్‌పురా పోలీస్ సిబ్బంది చేరుకుని వృక్షాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. వృక్షం కూలినప్పుడు అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోపక్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని పేర్కొంది. దీనికితోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా ఇంకోవైపు వడగాలులు భయపెడుతున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 63 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని పేర్కొంది. మరో 22 జిల్లాల్లో 40.5 నుంచి 42.7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలోని 3 మండలాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 11 మండలాలు వడ గాలుల ప్రభావానికి లోనయ్యాయి. ఇక ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే, మరో రెండు రోజుల్లో నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని సంగంప్రాంతం మేరకు విస్తరించాయి.
