అన్నదాతలకు వానాకాలం పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ‘రైతు సమ్మేళనం’ నిర్వహించి, ఆ సభా వేదిక నుంచే రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ జమ చేయనుంది.

అలాగే, ప్రజల అవసరాలకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ఉన్న ఏడు రకాల సన్నాలకే 500 రూపాయల బోనస్ వర్తింపజేయనున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ధాన్యం సేకరణ విధానాలు, ఎరువుల కోటా కేటాయింపులు, మెట్రో రుణం మంజూరు నిలుపుదలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర హక్కుల సాధన కోసం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించింది. రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా తమతో కలిసిరావాలని కోరింది. ఇకపై కేంద్రం మద్దతు ధర ప్రకటించి సేకరించే పంట ఉత్పత్తులను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏడు సన్నరకాలను మాత్రమే ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. BPT-5204 , RNR-15048, HMT సోనా, జై శ్రీరామ్, KNM-1638, WGL-44, KNM-7715 రకాలకే 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి చెప్పారు.
ఈ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని.. కానీ, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మరోపక్క ఎలినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తొలకరి వర్షం పడగానే తొందరపడి విత్తనాలు వేయవద్దని, భూమిలో తగినంత పదును లేకపోతే మొలక శాతం దెబ్బతింటుందని హెచ్చరించారు. కనీసం 7 మిల్లీమీటర్ల వర్షపాతం రెండు సార్లు నమోదైతేనే విత్తనాలు వేయాలని, రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని కోరారు. రాష్ట్రానికి ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత కోటాను సకాలంలో అందించడం లేదని మంత్రి తుమ్మల ఆరోపించారు.
నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని కేంద్రం వాగ్దానం చేసినప్పటికీ, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లక్ష టన్నులకు మించి సరఫరా చేయలేదన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి అందాల్సిన 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశామన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో.. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేసేలా త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో మొత్తం కోటాను తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
Follow for more updates
