సాయికృష్ణ కేసులో బిగ్‌ ట్విస్ట్‌…CCTV ఫుటేజ్ మాయం | Sai Krishna Case | CCTV Footage Missing

సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌​ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో సస్పెండైన సీఐ నాగరాజు పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ రికార్డులను పరిశీలించిన సిట్ అధికారులు, మే 1 నుంచి జూన్ 1 వరకు ఉండాల్సిన ఫుటేజ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించినట్లు సమాచారం. నెల రోజుల వ్యవధిలో.. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉంచబడినట్లు తేలింది. మిగతా రికార్డులు ఉద్దేశపూర్వకంగానే తొలగించబడ్డాయా? గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ప్లాన్ చేశారా? నాగరాజే వీటి వెనుక ఉన్నాడా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ దృశ్యాలను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలకు ముందే మే నెలకు సంబంధించిన ఫుటేజ్ తొలగించబడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఇది సాధారణ సాంకేతిక లోపమా లేదంటే కీలక ఆధారాలను చెరిపివేసే ప్రయత్నమా? అనే దానిపై విచారణ ముమ్మరమైంది. సాయికృష్ణ కేసు దర్యాప్తుకు ఈ సీసీటీవీ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలపై స్పష్టత ఇవ్వగల ఆధారాలు ఇవేనని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ఫుటేజ్ లేకపోవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఐ నాగరాజే ఉద్దేశపూర్వకంగా వాటిని మాయం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోపక్క సాయికృష్ణ కేసుపై చంద్రబాబును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబూ.. సాయికృష్ణ చనిపోయాడా లేక బతికే ఉన్నాడా? ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే, ఆయన డెడ్ బాడీ ఎక్కడ ఉంది? నాలుగు రోజుల క్రితమే ఎఫ్‌ఐఆర్ నమోదైనా ఇప్పటికీ ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఏపీలో గాదె సాయికృష్ణ కేసు పెద్ద వివాదంగా మారింది. అతడి అదృశ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత అదృశ్యమయ్యాడు. పోలీసులు కస్టడీలో టార్చర్ చేసి హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top