పూణే మర్డర్ మిస్టరీ | Pune Murder Mystery | Ketan Agarwal Case | Siya Goyal


పూణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగి, నవంబర్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లికి సిద్ధమైన ఒక జంట కథ.. చివరకు ఓ ఘోరమైన హత్యోదంతంగా ముగిసింది.

తన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అత్యంత కిరాతకంగా ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 18న లోహగడ్ కోట లోయలోకి కేతన్‌ను తోసేసి, ప్రమాదవశాత్తు జరిగిందంటూ నమ్మించే ప్రయత్నం చేసిన ఈ ఇద్దరి కుట్రను పూణే రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో చేధించారు. ఈ ఘోరానికి వెనుక ఆరు నెలల సుదీర్ఘమైన ప్లానింగ్ ఉందని దర్యాప్తులో తేలింది. సియా, చేతన్ ఇద్దరూ గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

వీరిద్దరూ దాదాపు 238 గంటల పాటు ఫోన్ కాల్స్‌లో గడపడమే కాకుండా, కొన్ని సంభాషణలు ఏకధాటిగా మూడు గంటల కంటే ఎక్కువ సమయం సాగాయని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. హత్య జరిగిన రోజు కూడా వీరిద్దరూ ముందుగా ఒక కేఫేలో కలుసుకుని, లోహగడ్ కోటలో ఏ పాయింట్ నుంచి కేతన్‌ను లోయలోకి తోసేయాలో పక్కాగా స్కెచ్ వేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.

అయితే, కేతన్‌ను మట్టుబెట్టడానికి వారు జూన్ 18 కంటే ముందే మూడు సార్లు విఫలయత్నాలు చేసినట్లు విచారణలో తేలింది. మొదట జూన్ 6న బాలిలో జరగాల్సిన వీరి ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌ను చెడగొట్టడానికి, ఖలాపూర్ సమీపంలోని ఫుడ్ మాల్‌లో కేతన్ పాస్‌పోర్ట్‌ను సియా దొంగిలించి మహిళల వాష్‌రూమ్‌లో పడేసింది. ఆ తర్వాత మే 31, జూన్ 4 తేదీల్లో కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లాలని చూసినా, ఒకసారి కేతన్ తల్లి వారించడంతో ఆ ప్లాన్ సాగలేదు.

చివరకు జూన్ 14న కోటకు తీసుకెళ్లి లోయలోకి నెట్టేయగా.. కేతన్ అదృష్టవశాత్తు ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు కంగారుపడిన సియా, అక్కడ పాము రావడంతోనే నువ్వు జారిపడ్డావని, నిన్ను తానే కాపాడానని నమ్మబలికింది. అయినప్పటికీ వదలకుండా జూన్ 18న మళ్లీ అక్కడికే తీసుకెళ్లి అనుకున్న కార్యాన్ని ముగించారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top