BCCI vs ICC: పీసీబీ, బీసీబీ ఎఫెక్ట్.. బీసీసీఐకి బుర్ర బద్దలయ్యే న్యూస్ చెప్పనున్న ఐసీసీ..?

India Hosting Rights 2029 Champions Trophy: పాకిస్తాన్, బంగ్లాదేశ్ కారణంగా బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ తగలనుందా..? అంటే, అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇకపై భారతదేశంలో జరగబోయే ఐసీసీ టోర్నమెంట్స్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే జరిగితే బీసీసీఐకి భారీ నష్టం కలగనుందని తెలుస్తోంది.

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, భవిష్యత్‌లో భారత్‌ నిర్వహించబోయే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ల ఆతిథ్య హక్కులను మార్చే అవకాశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్ కప్ భారత్‌లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇవి వేరే దేశాలకు మారే అవకాశముందని ఆస్ట్రేలియా మీడియా సంస్థ ‘ది ఏజ్’ పేర్కొంది.

ప్రస్తుతం భారత్ వర్సెస్ పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం బాగోలేవు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన సైనిక చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత జట్టు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదే ధోరణిని ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లోనూ భారత్ కొనసాగిస్తోంది. 2023 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చినప్పటికీ, గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ భారత్ మ్యాచ్‌ల కోసం యూఏఈని న్యూట్రల్ వేదికగా ఎంచుకోవాల్సి వచ్చింది.

కొన్ని నెలల క్రితం బీసీసీఐ (BCCI), పీసీబీ (PCB) కలిసి ఐసీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ టోర్నీల్లో పరస్పరం ఒకరి దేశాలకు మరొకరు వెళ్లి ఆడకూడదని ఇరు దేశాల బోర్డులు అంగీకరించాయి. 2008 నుంచి భారత్ పాకిస్థాన్‌కు వెళ్లలేదు. ఇక పాకిస్థాన్ మాత్రం 2012–13 ద్వైపాక్షిక సిరీస్ కోసం, అలాగే 2016, 2023 ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వచ్చింది. అయితే, భవిష్యత్తులో భారత్‌కు రావడం కూడా సాధ్యం కాదని పీసీబీ సంకేతాలు ఇస్తోంది.

ఇదిలా ఉండగా, భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ కూడా ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రావడానికి నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడాలని బంగ్లాదేశ్ కోరినా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించి, చివరకు స్కాట్లాండ్‌తో భర్తీ చేసింది. భవిష్యత్తులో భారత్ బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందా లేదా అన్నది కూడా ఇంకా స్పష్టతకు రాలేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఐసీసీ భవిష్యత్ గ్లోబల్ టోర్నీలను భారత్ నుంచి వేరే దేశాలకు తరలించే అంశాన్ని పరిశీలిస్తోంది. లాజిస్టిక్ సమస్యలు, భద్రతా ఆందోళనల కారణంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్ కప్‌లను భారత్ కాకుండా మరో దేశంలో నిర్వహించే అవకాశం ఉందని ‘ది ఏజ్’ పేర్కొంది. ఈ రెండు మెగా ఈవెంట్లను ఆతిథ్యం ఇవ్వడానికి ఆస్ట్రేలియా ముందంజలో ఉందని కూడా ఆ కథనం వెల్లడించింది.

ఇదిలా ఉండగా, టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175/7 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో చెలరేగి ఆడాడు. లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో భారత్ వరుసగా మూడో గెలుపు సాధించి సూపర్ 8కు అర్హత సాధించింది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top