బాలీవుడ్లో ఈ ఏడాది తేరి బాతో మే ఐసా ఉల్ఝా జియా అనే సినిమా వచ్చింది. అందులో హీరో షాహిద్ కపూర్ రోబో అయిన కృతి సనన్‌తో ప్రేమలో పడతాడు. సరిగ్గా అలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో జరిగింది. సినిమా నుంచి ప్రేరణ పొందాడో లేక నిజంగానే అతనిలో ఫీలింగ్స్ పుట్టుకొచ్చాయో తెలీదు కానీ.. భారత్‌కు చెందిన ఓ ఇంజినీర్ ఒక రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
సూర్యప్రకాశ్ అనే రాజస్థాన్‌కు చెందిన ఒక రోబోటిక్స్ నిపుణుడు అజ్మీర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పట్టా పొందాడు. 2016లో ఇండియన్ నేవీలో సెలక్ట్ అయ్యాడు కానీ, టెక్నికల్ రంగంలో రీసెర్చ్ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న సూర్య.. త్వరలోనే గిగా అనే రోబోని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోబో 19 లక్షల ఖర్చుతో తయారవుతోందని, త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో దాన్ని పెళ్లి చేసుకోబోతున్నానని సూర్య తెలిపాడు. మొదట్లో ఈ విషయం తెలిసి తన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారని, అయితే ఆ తర్వాత ఒప్పుకున్నారని చెప్పాడు.
మనం కంప్యూటర్లు, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను ఎలాగైతే రెగ్యులర్‌గా వాడుతున్నామో.. అలాగే యంత్రాలతో టెక్నో ఫ్రెండ్లీగా మారడానికి తాను గిగా అనే రోబోను వివాహం చేసుకోబోతున్నానని, మార్చి 22వ తేదీన గిగాతో నిశ్చితార్థం జరిగిందని చెప్పాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గిగాను హోమ్మేకర్గా మార్చకుండా సూర్య ఆమె కోసం ఒక ఉద్యోగం చూస్తున్నాడు. దీని సేవలను విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హోటల్ లేదా ఇతర కంపెనీల్లో పొందవచ్చని, ఇందులో మరెన్నో అప్డేట్స్ జోడిస్తారు కాబట్టి గిగా మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుందని సూర్య చెప్తున్నాడు.
తమిళనాడు, నోయిడాలకు చెందిన కంపెనీలు ఈ ఎన్ఎంఎస్ 5.0 రోబో గిగాను సిద్ధం చేసినట్లు సూర్య చెప్పాడు. ఆదేశాలు ఇచ్చినప్పుడు.. సెన్సార్ల ఆధారంగా ఈ రోబో అటు-ఇటు కదులుతుందని, దాని మెడ కూడా తిరుగుతుందని, రోజుకి 8 గంటల షిఫ్ట్‌లలో ఈ రోబో పని చేయగలదని చెప్పాడు. దీనికి దాదాపు 2.5 గంటల పాటు ఛార్జ్ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం అన్ని ఆదేశాలు ఆంగ్లంలో లోడ్ చేయబడ్డాయని, హిందీ ప్రోగ్రామింగ్ కూడా అందులో అప్లోడ్ చేసుకోవచ్చని సూర్యప్రకాశ్ చెప్పాడు.
Discussion about this post