ఖమ్మం జిల్లా రైతులకు మేలు చేయాలన్న సదుద్దేశంతో చేపట్టిన మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణంలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతల ప్రాపకంతో కాంట్రాక్టరు తాను చేయాల్సిన పనులను సబ్ కాంట్రాక్టర్ కు కట్టబెట్టేశారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే కుడిభుజంగా చెప్పుకునే నేత కాంట్రాక్టర్ అవతరమెత్తి నాసిరకంగా పనులు చేపట్టడంతో పాటు అక్కడి మట్టిని సైతం అమ్మేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిర్వాకంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. తప్పుచేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్…
ఖమ్మంలో ఉన్న మార్కెట్ పై పంట ఉత్పత్తుల భారం పడకుండా.., ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు, రైతులకు మరింత మేలు చేయడానికి మద్దులపల్లి మార్కెట్ యార్డును 2018 జులైలో అప్పట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మంజూరు చేయించారు. మార్కెట్ యార్డు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామం వద్ద సర్వే నెంబర్ 90లో ఖమ్మం – సూర్యాపేట, ఖమ్మం – కోదాడ ప్రధాన రహదార్ల వెంబడి మొత్తం 29.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపజేశారు.
మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంజూరు చేయించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా తుమ్మల ఓడిపోవడం, మార్కెట్ యార్డు కోసం కేటాయించిన భూమికి రోడ్డు సమస్య తలెత్తడం, కొంత ప్రైవేట్ వ్యక్తుల భూమి సేకరించాల్సి రావడం లాంటి కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది. సమస్యలన్నీ తొలగిన తర్వాత 2022 మే 4న మార్కెట్ యార్డు నిర్మాణానికి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకు స్థాపన చేశారు. మరోవైపు ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందిన తర్వాత మార్కెట్ యార్డు సిద్ధం కాకముందే పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త వివాదానికి తెర లేపారు. దీనిపై మంత్రి పువ్వాడ, సీఎం కేసీఆర్ అభ్యంతరం చెప్పలేదు.
మరోవైపు .. కాంట్రాక్టర్ అభ్యర్ధన మేరకు ఎలాంటి పనులు చేపట్టకముందే అంచనాలను సవరించి 15 కోట్ల నుంచి 19.90 కోట్ల రూపాయలకు పెంచారు. ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ పనులను ఆలస్యం చేస్తుండడంతో, ఆ కాంట్రాక్టును రద్దు చేసి మరోసారి టెండర్లు పిలిచారు. ఈసారి ఖమ్మానికి చెందిన ఒక సంస్థ టెండర్ దక్కించుకోగా పాలేరు నియోజకవర్గానికి చెందిన అప్పటి అధికార పార్టీ నేత సబ్ కాంట్రాక్టర్ గా మారి పనులు ప్రారంభించారు. అదే సమయంలో ఖమ్మం, సూర్యాపేట హైవే నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ పనులకు మార్కెట్ నిర్మాణ పనులను అడ్డుపెట్టి మట్టిని అమ్ముకోవడంతోపాటు, ప్రైవేట్ వెంచర్లకు కూడా తరలించారన్న ఆరోపణలున్నాయి.
మార్కెట్ యార్డు నిర్మాణానికి సంబంధించి 17 రకాల పనులకు అగ్రిమెంట్ జరగ్గా కేవలం ఎనిమిది పనులు మాత్రమే మొదలు పెట్టారు. రహదారి కోసం జరిగిన పనుల్లో మార్కెట్ కు వెళ్లే దారి కోసం 2.26 కోట్ల రూపాయలు, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు 45 లక్షల రూపాయలను కాంట్రాక్టర్ కు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ నిర్మాణ పనులు ఆ స్థాయిలో జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. జంగిల్ కటింగ్, లెవలింగ్ పనులు చేసినట్టు కాగితాలపై చూపి బిల్లులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
మార్కెట్ యార్డు భవనం కోసం కట్టిన పిల్లర్లు నాసిరకంగా ఉన్నాయని, బీములు వంకర్లు తిరిగాయని, బీముల్లో ఉపయోగించిన ఐరన్ కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని పలువురు స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి పొంగులేటి మార్కెట్ యార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి సబ్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత, సబ్ కాంట్రాక్టర్ మార్కెట్ యార్డు స్థలంలో ఉన్న మట్టి గుట్టలను విక్రయించి లక్షల రూపాయలు సంపాదించారని స్థానికులు మంత్రి పొంగులేటి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి స్పందిస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. మద్దులపల్లిలోని వైటీసీ బిల్డింగ్ పక్కన రెండు ఎకరాల భూమిని ఆంధ్రాబ్యాంక్ సొసైటీకి, కోల్ట్ స్టోరేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. ఆ భూముల్లో కూడా 20 అడుగుల లోతు గోతులు తవ్వి మట్టి మొత్తాన్ని కాంట్రాక్టర్ మార్కెట్ రోడ్డు నిర్మాణం కోసం తరలిస్తుండడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే బీఆర్ఎస్ నేత అయిన కాంట్రాక్టర్ తీరుకు అధికారులు భయపడి పట్టించుకోలేదని మంత్రికి వివరించారు. గోతులు పడిన భూమి ఇప్పుడు కోల్ట్ స్టోరేజీ నిర్మాణానికి పనికిరాకుండా పోయిందని వాపోయారు. కాంట్రాక్టర్ అక్రమాల వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆగం కావడంతోపాటు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మార్కెట్ యార్డు నిర్మాణ పనులు నిబంధనల ప్రకారం నిర్మాణం జరగడం లేదని, నాణ్యత లేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచరుడు కాంట్రాక్టర్ అవతరమెత్తి మార్కెట్ స్థలంలోని మట్టిని తవ్విఅమ్ముకున్నాడని చెబుతున్నారు. తర్వాత మార్కెట్ పనులకు మట్టి అవసరం పడితే మళ్లీ కొనుగోలు చేసి బిల్లులను డ్రా చేసుకున్నాడని అంటున్నారు. సిమెంటుకు బదులు ఎక్కువగా స్టోన్ పౌడర్ వాడారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని.. ప్రభుత్వ స్ధలంలోని లక్షల రూపాయలు విలువ చేసే మట్టిని కాజేశారని ఖమ్మం జిల్లా ఐద్వా మహిళా సంఘం సెక్రటరీ మాచర్ల భారతి అన్నారు. మార్కెట్ యార్డు పూర్తయితే ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడ జరిగిన అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని భారతి, ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మాదినేని రమేష్ డిమాండ్ చేశారు.
మార్కెట్ యార్డు వస్తుందని అయిదేళ్లుగా చెబుతున్నారని.. కానీ ఇంతవరకు జరగలేదని మద్దులపల్లి గ్రామా సర్పంచ్ సుభద్ర ఆవేదన వ్యక్తం చేశారు. పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో మంత్రి పరిశీలించారని, ఇప్పటికైనా మార్కెట్ యార్డును ఒక కొలిక్కి తీసుకురావాలని కోరారు.
ప్రజల ఫిర్యాదులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. పనుల్లో జాప్యం చేయడంతో పాటు నాసిరకంగా నిర్మించారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కాంట్రాక్టర్ తిన్న సొమ్మును తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డు నిర్మాణ పనుల్లో అవినీతిని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Discussion about this post