అదో దట్టమైన అటవీ ప్రాంతం… ఎటు చూసినా ఎత్తైన చెట్లతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది… జనావాసాలకు ఆస్కారం లేని ప్రదేశమది… రాత్రి పూట కాదు కదా… కనీసం పగలంతా కూడా ఒంటరిగా వెళ్లాలంటే ఆ అడవిలో భయపడే పరిస్థితి… అలాంటి దట్టమైన అడవిలో ఒకే ఒక కుటుంబం కొన్నేళ్లుగా జీవిస్తోంది… కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఎవరూ కనిపించని అడవిలో… ఎలాంటి సదుపాయాలు లేనిచోట ఒంటరిగా జీవిస్తోన్న కొండారెడ్ల కుటుంబ పరిస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
ఇదిగో మీరిప్పుడు చూస్తోన్న ఈ చిన్న గుడిసే ఓ గిరిజన తెగ కుటుంబం ఒంటరిగా జీవిస్తోన్న నివాసం. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల గ్రామపంచాయితీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మండలానికి సుమారు 40కిలోమీటర్ల దూరంలో ఉంటోంది. ఆ ఒక్కటే కుటుంబం నివశించే ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లాలంటే… కనీసం ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్లక తప్పదు. ఈ ప్రాంతంలో వెలిసి అడవి దేవతగా పేరుగాంచిన గుబ్బల మంగమ్మ ఆలయం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన ప్రదేశంలో కొండారెడ్లుగా పిలిచే గిరిజిన తెగకు చెందిన ఏకైక కుటుంబం ఇక్కడ ఒంటరిగా దశాబ్ద కాలంగా జీవిస్తోంది.
ఇంతకీ ఈ కుటుంబం ఒక్కటే ఎందుకు ఒంటరిగా దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తోందో తెలుసుకోవాలంటే… మనం పది, పన్నేండేళ్లు కాల గమనంలో వెనక్కి వెళ్లాలి. ఒకప్పుడు ఇక్కడ గిరిజన కొండారెడ్లకు చెందిన 50 కుటుంబాలు నివశించేవి. ఈ 50 గిరిజన కుటుంబాలు నివశించే ప్రాంతాన్ని గోగుల్ పూడిగా పిలిచేవారు. అయితే చాలాకాలంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివాసీ సాంప్రదాయంలో జీవనం సాగిస్తోన్న వీరందరినీ అక్కడి నుంచి జనావాస ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు దశాబ్ద కాలం క్రితమే కొండారెడ్లకు చెందిన 50 గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ కన్నయ్యగూడెం గ్రామ పంచాయితీ పరిధిలో ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఇక వారికి తెలిసింది పోడు వ్యవసాయం మాత్రమే కావడంతో… వ్యవసాయం చేసుకునేందుకు గానూ ఒక్కో కుటుంబానికి ఒక్కో ఎకరం చొప్పున భూమి కూడా ఇచ్చింది.
ప్రభుత్వం గిరిజనుల కోసం తీసుకున్న పునరావాసం ఇష్టపడ్డ కుటుంబాలన్నీ తరతరాలుగా జీవిస్తోన్న గోగుల్ పూడి ప్రాంతాన్ని ఖాళీ చేసి కన్నయ్యగూడెం ప్రాంతానికి వచ్చాయి. అయితే ఒక్క రెడ్డప్ప కుటుంబం మాత్రం తాము తరాలుగా జీవిస్తోన్న గోగుల్ పూడిలోనే ఉండిపోయింది. తమ గిరిజన తెగకు చెందిన 50 కుటుంబాలు ఎనిమిది కిలోమీటర్ల దూరానికి వెళ్లి ప్రభుత్వం కల్పించిన పునరావాస ప్రదేశంలో జీవిస్తుండగా… రెడ్డెప్ప కుటుంబం మాత్రం గడిచిన దశాబ్ద కాలానికి పైగా ఇక్కడే పాత గోగుల్ పూడి ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తోంది. సుమారు పది, పన్నెండేళ్లుగా ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో రెడ్డెప్ప, తన భార్య లక్ష్మీ, కొడుకుతో కలిసి జీవిస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఈ గుడిసెలోనూ నివాసం ఉంటున్నారు. చుట్టు కనుచూపు మేరలో మరో నివాసం కనిపించదు. నివాసమే కాదు… కనీసం ఇటువైపు వచ్చి వెళ్లే వారు కూడా కనిపించరు.
రెడ్డెప్ప కుటుంబం నివశిస్తోన్న ఈ ఇల్లు… గుబ్బల మంగమ్మ ఆలయానికి 5కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఆలయానికి వచ్చే సందర్శకులతో ఇక్కడి వరకు మాత్రం అప్పుడప్పులు మనుషుల రాకపోకలు కనిపిస్తాయి. ఇక ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల వరకు కొండపైకి రెడ్డెప్ప కుటుంబం మాత్రమే రాకపోకలు సాగిస్తోంది. వారిని చూసేందుకు గానీ, అటువైపుగా వెళ్లేవారు గానీ ఎవరూ ఉండరు. ఈ కుటుంబానికి కూడా నిత్యావసరాలు… అనగా నూను, బియ్యం, పప్పు, ఉప్పు, కారం, ఇతరత్రా ఏదైనా అవసరమైతే కనీసం ఐదు కిలోమీటర్లు రావాల్సిందే. తాగేందుకు మంచినీటి కోసం సమీపంలోని వాగుపై ఆదారపడుతుందీ కుటుంబం. ఈ కుటుంబంలోని ముగ్గురిలో ఒకరికి మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన ఆదార్ కార్డు ఉంది. ఆదార్ కార్డు కలిసిన లక్ష్మీకి ప్రభుత్వ పరంగా పించన్ కూడా అందుతోంది. ఇక రెడ్డెప్పకు, అతిని కొడుక్కు మాత్రం ఆధార్ కార్డు కూడా లేవు.
తమతో పాటు కొన్ని దశాబ్దాల పాటు నివశించిన 50 కుటుంబాలు ప్రభుత్వం కల్పించిన పునరావాస ప్రాంతానికి వెళ్లినప్పటికీ… ఈ ఒక్క కుటుంబమే వెళ్లకుండా దశాబ్ద కాలానికి పైగా ఒంటరిగా జీవిస్తోన్న విషయం తెలుసుకున్న ఫోర్ సైడ్స్ టీవీ వారిని పలకరించేందుకు దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లింది. ముందుగా గుబ్బల మంగమ్మ ఆలయానికి చేరుకొని… అక్కడి నుంచి ఫోర్ సైడ్స్ టీవీ కాలినడకన రెడ్డప్ప నివశించే కొండపైకి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. దశాబ్ద కాలానికి పైగా ఆ కుటుంబం ఒక్కటే ఒంటరిగా ఎందుకు నివశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తాము ఆ ప్రదేశాన్ని వదిలి వచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పిన రెడ్డెప్ప కుటుంబం… రెండోసారి ఫోర్ సైడ్స్ టీవీ ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతాన్ని విడిచి పునరావాస ప్రాంతానికి వచ్చేందుకు అంగీకరించింది. అయితే తమకు తెలిసింది వ్యవసాయమే కాబట్టి వ్య…
తోటి నాగరిక సమాజంలో జీవనం సాగించేందుకు సిద్దమంటున్న రెడ్డెప్ప కుటుంబానికి ప్రభుత్వం పునరావాసం కల్పించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. కొండపైన ఒంటరిగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించి ఇతర కుటుంబాలతో కలిసి జీవించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీరి నివశించే ప్రాంతంలో గతంలో 50 కుటుంబాలు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో అటవీ అధికారులు పోడు వ్యవసాయం కూడా చేయనీవడం లేదు. ప్రభుత్వం కల్పించిన పునరావాస ప్రదేశానికి వెళ్లాలని వారు సూచిస్తున్నారు. అటు ఉన్న చోట తోడులేక, పోడు వ్యవసాయం చేసుకునే అవకాశం లేక, ఇతరులతో కలిసేందుకు దారి దొరక్క సతమతం అవుతోన్న ఈ గిరిజన కుటంబాన్ని ఐటీడీఏ అధికారులు సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందించాలని ఫోర్ సైడ్స్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది. అధికారుల చొరవతో ఇప్పటికైన రెడ్డెప్ప కుటుంబం అటవీ ప్రాంతంలోని ఒంటరి…
ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలానికి 40కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తోన్న రెడ్డెప్ప కుటుంబ జీవన పరిస్థితి.
Discussion about this post