ఆదిత్య ఎల్1 నుంచి ఫోటోల రాక
ఆదిత్య ఎల్1, చంద్రయాన్ ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక పురోగతి సాధిస్తోంది. సూర్యుడి గుట్టుమట్లు తెలుసుకుని పరిశోధనలు చేసేందుకు ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతంగా సాగుతోంది. సూర్యుడి సమీపంలోకి చేరుకోకముందే తన పనిని ప్రారంభించిన ఆదిత్య ఎల్1 ఇప్పటికే కీలక సమాచారాన్ని భూమికి చేరవేసింది. తాజాగా సూర్యుడి ఫోటోలను ఇస్రోకు పంపింది.
సూర్యుడి తాజా చిత్రాలను అల్ట్రావైలెట్ వేవ్ లెంగ్థ్స్ సమీపం నుంచి ఆదిత్య ఎల్ 1 తీసింది. ఈ ఫొటోలను ఇస్రో ట్విటర్లో షేర్ చేసింది. ఈ ఫుల్ డిస్క్ చిత్రాల ద్వారా సూర్యుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లకు సంబంధించి క్లిష్టమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకోవడంలో ఈ ఫోటోలు కీలకమైన సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో వెల్లడించింది.
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబరు 2 న ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. సూర్యుడికి దగ్గరగా ఉండే లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు చేరుకోవడానికి మొదలైన ఈ ప్రయాణం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంటోంది. ఆదిత్య ఎల్1 ను లాగ్రాంజ్ పాయింట్ 1 లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన ప్రక్రియలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని ఇస్రో తెలిపింది.
మరోవైపు .. చంద్రయాన్ 4 ప్రయోగానికి సంబంధించిన కీలక అప్డేట్ బయటికి వచ్చింది.
చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి శాంపిల్స్‌ను సేకరించి.. వాటిని భూమికి తీసుకువచ్చేలా చంద్రయాన్ 4 ప్రయోగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
వచ్చే ఐదారేళ్లలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
చంద్రయాన్ 4 మిషన్‌లో ప్రధానంగా నాలుగు మాడ్యూల్స్ ఉంటాయని తెలుస్తోంది. ట్రాన్స్ఫర్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, అసెండర్ మాడ్యూల్, రీ ఎంట్రీ మాడ్యూల్ ఉంటాయని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. అందుకే చంద్రయాన్ 4 మిషన్‌లో 2 వేర్వేరు ప్రయోగ వాహనాలు ఉంటాయని తెలిపాయి. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన మూన్ మిషన్ల కంటే ఈ ప్రయాగం భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో చంద్రయాన్ 4పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Discussion about this post