అరకు… తూర్పు కనుమలో అదొక భూతల స్వర్గం… శీతాకాలం వచ్చిందంటే అరకు అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య జాలు వారే జలపాతం .. ప్రకృతి సోయగాన్ని పంచుతూ మంచుతో మనసుకు ఉత్తేజాన్నికలిగిస్తాయి. . ప్రకృతికి రమణీయత కు నిలయమైన అందాల ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే.
శీతాకాలం అరకుకు కొత్త సోయగాలను తెచ్చిపెడుతుంది. సిటీ లైఫ్ తో ..కాలుష్యపు విషగాలులు పీలుస్తూ బతికే వారు ఈ సీజన్ లో అరకు వెళితే అక్కడి అందాలకు అబ్బుర పడతారు. చల్లని మేఘాలు పక్కగా వెళుతూ పలకరిస్తుంటే మైమరచి పోతాం. పుడమి తల్లి పచ్చని పూలను సిగలో పెట్టుకుని కనిపిస్తుంది . ఆ ప్రాంతం లో తెల్లని పొగ మంచు దట్టంగా పరుచుకున్న దృశ్యాలు పర్యాటకుల మనసును పరవశింప చేస్తాయి. మంచు తెరలను చీల్చుకుంటు చేసే అరకు ప్రయాణం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది.
ప్రకృతి సోయగాలు సింగిరి అయినా అరకు శీతాకాలంలో పర్యాటకులు క్యూ కడుతుంటారు. అరకు లోయ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. బొర్రా గుహలు , కటికి జలపాతం, తాడిగూడ జలపాతం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, సుంకరమెట్ట యు పాయింట్, గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, చాపరాయి జలపాతాలను వీక్షించి మరిచిపోలేని అనుభూతులను మూట కట్టుకుని మధురానుభూతి పొందుతారు.
విశాఖ మన్యంలోని అందాలు.. అక్కడ గిరిజనుల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు, గిరిజనులతో చేసే దింసా నృత్యాలు చూసి ఉల్లాస భరితులవుతారు. అక్కడి కాఫీ కేఫ్ లో ఎన్నో రకాల కాఫీ కూడా తాగవచ్చు. ఈ శీతాకాలంలో అరకు పాడేరు, వంజంగి ఏజెన్సీలోని ప్రాంతాలలో పర్వతాలపై ప్రయాణించే మేఘాలను చూసి చూడవలసిందే. ఒక్కోసారి మనలను తాకుతూ కూడా వెళుతుంటాయి మేఘాలు.అలాంటి సౌందర్య దృశ్యాలు మన్యం కే పరిమితం.
అందుకే పర్యాటకులు క్యూ కడుతుంటారు. కొండల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసే తోటలు చూడ ముచ్చటగా కనిపిస్తాయి. ఎత్తైన కొండల మధ్య కురుస్తున్న పొగ మంచు మేఘాలు భూమిని తాకుతున్నాయా అన్నట్టు చూపరులకు కనువిందు చేస్తాయి. వాటిని వీక్షించే పర్యాటకులు మంత్ర ముగ్దులవుతారు. గజగజ వణికించే చలిలో సైతం సంతోషంతో తడిచి ముద్ద అవుతారు.
విశాఖ నుండి అరకు ప్రయాణం సుమారు 115 కిలోమీటర్లు కొండల మధ్య ప్రయాణం కొంచెం కష్టంగా ఉన్నా ..అరకు అందాలను చూసి దాన్ని మర్చిపోతారు. అరకుకి అతి సమీప దూరంలో ఉన్న మాడగడ కొండ పై భాగం దట్టంగా పొగ మంచు కమ్ము కోవడంతో మంచు కైలాసంలో తేలి ఆడిన ఫీలింగ్ కలుగుతుంది. పర్యాటకులైతే అసలు భూమి మీదనే ఉన్నామా లేక ఆకాశంలో తేలి ఆడుతున్నమా అన్న అనుభూతికి లోనవుతారు. అద్భుతమైన ప్రకృతి అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సరదా ఒక సారి వెళ్ళివద్దామా ?
Discussion about this post