పీపుల్స్ ఆఫీసర్‌గా ప్రసిద్ధి చెంది, తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఆమె షేర్ చేసిన పాత ఫోటో, కామెంట్ దీనికి బలం చేకూరుస్తున్నాయి .
స్మితా సబర్వాల్ తన 23 ఏళ్ల కెరీర్ ను ప్రస్తావిస్తూ ఆ పాత ఫోటోను షేర్ చేశారు. ఎత్తుపల్లాల్లో సాగిన పయనాన్ని కొన్ని ఫోటోలు గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు నచ్చిన బాటలోనే కొనసాగినట్టు చెప్పిన ఆమె.., కొత్త సవాళ్లు స్వీకరించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటానని స్పష్టం చేశారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలని తెలిపారు.
తెలంగాణ కేడర్‌కు చెందిన 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన స్మితా సబర్వాల్ 1977 జూన్ 19న డార్జిలింగ్ లో జన్మించారు. ఆమె విద్యాభ్యాసమంతా సికింద్రాబాద్, హైదరాబాద్ లలో సాగింది. 22 ఏళ్ల వయసులో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్ సాధించారు. ఆదిలాబాద్, మదనపల్లి, కడప, వరంగల్, విశాఖపట్నం, కర్నూలు, హైదరాబాద్ లలో సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయిల్లో పని చేశారు.
2011 ఏప్రిల్‌లో కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అత్యుత్తమమైన పని తీరుతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆమె చురుకుగా పనిచేసి కెసిఆర్ దృష్టిలో పడ్డారు. సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూనే.. నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా చూసారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పనుల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించారు.
అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించలేదు. కీలక సమీక్షలకూ హాజరు కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏర్పడిన అనుబంధం వల్లే ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేయాలని అనుకోవటం లేదని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసారని అంటున్నారు.
Discussion about this post